భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రజలు భీభత్స పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్‌పై వరుణుడు మళ్లీ ప్రతాపం చూపిస్తున్నాడు! అతి భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు హడలెత్తిపోతున్నారు. తాజా పరిణామాలతో 22మంది ప్రాణాలు కోల్పోయారు. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అనేక ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్టు సమాచారం.
శిమ్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరణించిన 22మందిలో శిమ్లా నుంచే తొమ్మిది మంది ఉన్నారు! ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శివాలయం కూలి వీరు మరణించారు. వీరి మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. ఫగ్లి ప్రాంతంలో అనేక ఇళ్లు మట్టి, బురదలో కూరుకుపోయాయి.
సోలన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం సాయంత్రం సంభవించిన క్లౌడ్ బరస్ట్‌తో రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. జడోన్ గ్రామంలో ఆరుగురిని అధికారులు రక్షించగా.. ఏడుగురు మరణించారు. వీరి వయస్సు 12- 36 ఏళ్ల మధ్యలో ఉంటుంది.
బలెరా పంచాయతీ పరిధిలో.. కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. వీరిలో ఒకరి మృతదేహమే ప్రస్తుతం లభించింది. ఇక బనాల్ గ్రామంలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. హమ్రపూర్లో భారీ వర్షాలు కారణంగా ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. మరికొన్ని రోజుల పాటు ప్రతికూల వాతావరణం ఉంటుందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
“రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కారణంగా జరిగిన మరణాల వార్త విని బాధ కలిగింది. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. మీ బాధను మేము పంచుకుంటున్నాము. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలి. డ్రైనేజీలు, నదుల వద్దకు వెళ్లకండి. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండండి,” అని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు విజ్ఞప్తి చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. తాజా పరిస్థితులను సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి కారణాలతో ఉత్తరాఖండ్ లో చార్ ధామ్ యాత్రను ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేశారు. చార్ ధామ్ యాత్రికులను సోన్ ప్రయాగ, గౌరి ఖుండ్ ల వద్ద ఆపివేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తరాఖండ్ లో వర్షాలు, వరదలతో కొండచరియలు విరిగిపడ్తున్నాయి. కొండచరియలు విరిగిపడడంతో రాష్ట్రంలో నాలుగు ప్రధాన రహదారులు, 10 కనెక్టింగ్ రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం కూడా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.