దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో ఏకమైన విపక్ష ఇండియా కూటమిలో పార్టీల మధ్య అప్పుడే తగాదాలు మొదలయ్యాయి. ఓవైపు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వెనక్కి తగ్గి స్ధానికంగా బలమైన ప్రాంతీయ పార్టీలకు సహకరించాలని గతంలో పలు పార్టీలు కోరాయి. దీనికి అంగీకరించిన కాంగ్రెస్ ఇప్పుడు మారుతున్న పరిస్దితుల నేపథ్యంలో ఈ హామీకి కట్టుబడి ఉంటుందా/ అన్న చర్చ మొదలైంది.
ఢిల్లీ పరిధిలోకి వచ్చే ఏడు లోక్ సభ సీట్లలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి అల్కా లాంబా చేసిన వ్యాఖ్యలు అధికార ఆప్ కు మంట పుట్టించాయి. ఓవైపు ఇండియా కూటమి పేరుతో భేటీలు నిర్వహిస్తూ కలిసి ముందుకు సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇలా ఏకపక్షంగా ప్రకటనలు చేయడాన్ని ఆప్ తీవ్రంగా తప్పుపట్టింది.
కాంగ్రెస్ ఇదే వైఖరి అనుసరిస్తే త్వరలో మహారాష్ట్రలో జరిగే ఇండియా కూటమి మూడో భేటీని బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యలకు దిగింది. అల్కా లాంబా పార్టీ అధికార ప్రతినిధి అయినప్పటికీ కీలక అంశాలపై ప్రకటనలు చేసే అధికారం ఆమెకు లేదని పార్టీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి.
ఆప్ అభ్యంతరాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ త్వరలో భేటీ అయి దీనిపై చర్చిస్తారని స్పష్టం చేశాయి. దీంతో ఆప్ దీనిపై ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది. ఢిల్లీలో కాంగ్రెస్-ఆప్ పొత్తుతో ముందుకెళ్లి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏడు సీట్లను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. ఈ తరుణంలో అల్కా లాంబా వ్యాఖ్యలు కలకలం రేపాయి.
మరోవైపు ఢిల్లీ బిల్లు విషయంలో ఆప్ పార్లమెంటులో కాంగ్రెస్ మద్దతు కోరడంతో .. ఆ పార్టీ కూడా లోక్ సభలో అండగా నిలిచింది. ఢిల్లీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఇరు పార్టీల మధ్య సఖ్యత కుదిరిందని భావిస్తున్న తరుణంలో అల్కా లాంబా ప్రకటన తిరిగి పరిస్ధితిని మళ్లీ మొదటికి తెచ్చేలా కనిపించింది.