ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ఆమె సంసిద్ధతను వ్యక్తం చేసిన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ నెల 12న ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాల్సి ఉన్నప్పటికీ, ఆమె స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగిన్నట్లు తెలుస్తున్నది.
ఇప్పటి వరకు తెలంగాణాలో రాజన్నా రాజ్యం తీసుకొస్తానంటూ తిరిగిన ఆమె ఇక నుండి ఏపీ రాజకీయాలపై దృష్టి సారించేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆమెను కర్ణాటక నుండి రాజ్యసభకు పంపించేందుకు కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడి చేస్తున్నాయి.
షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు కర్ణాటక ఎన్నికలు కాగానే సిద్దపడినా, తెలంగాణ రాజకీయాలకే పరిమితంగా ఉంటానని ఆమె చెబుతూ ఉండడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల నుండే వ్యతిరేకత వచ్చింది. ఆమె ఏపీలో అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సంఖ్యతో కోరుకుంటూ, ఇక్కడ కాంగ్రెస్ ప్రచారం చేబడితే జనంలో `తెలంగాణ సెంటిమెంట్’ రెచ్చగొట్టేందుకు కేసీఆర్ కు అవకాశం ఇచ్చినట్లు కాగలదని రేవంత్ రెడ్డి తదితరులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వారం లేదా ఈ నెలాఖరున ఈ విలీనం కార్యక్రమం పూర్తి చేయనున్నట్లు లోటస్ పాండ్ వర్గాల సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనానికి సంబంధించి అన్ని చర్చలు పూర్తి కాగా విలీనం వలన ఆమెకి చేకూరే ప్రయోజనాలపై కూడా చర్చలు పూర్తి అయ్యాయని తెలిసింది.
తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలనే ఉద్దేశంతో 2021 జులై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల స్థాపించారు. తానే అధ్యక్షురాలిగా ఉన్న పార్టీని ఆరంభంలో పరుగులు పెట్టించారు. వైఎస్ఆర్టీపీ ఆరంభంలో దూకుడుగానే ఉంటూ వచ్చింది. నాయకుల చేరికలు, పాదయాత్ర, ధర్నాలు, నిరసనలు, ప్రభుత్వంపై విమర్శలు, ఇలా ప్రారంభంలో అంతా బాగానే సాగింది.
కానీ ఆ తర్వాతే తేడా కొట్టింది. ఎంత చేసినా ప్రజల్లోకి పార్టీ వెళ్లలేకపోయింది. మరోవైపు కీలక నాయకులు ఒక్కొక్కరిగా పార్టీని వదిలేసి వెళ్లిపోయారు. ఇదే సమయంలో కర్ణాటక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పుంజుకోవడంతో షర్మిల వెనకబడిపోయారు. ఈ తరుణంలో ట్రబుల్ షూటర్ గా పేరున్న కర్ణాటక డీకే శివకుమార్ రంగంలోకి దిగి ఈ విలీనం ప్రతిపాదన తీసుకొచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఈ ప్రక్రియను ఆయనే దగ్గరుండి పూర్తి చేయనున్నారు.