జమ్మూ కశ్మీరులోని అత్యధిక ముస్లింలు హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వారే అంటూ జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డిపిఎపి) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను హిందూత్వ సంస్థలైన బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషద్(విహెచ్పి) స్వాగతించాయి. ఇది సానుకూల సంకేతమంటూ గులాం ప్రకటనను అభివర్ణించాయి.
600 సంవత్సరాల క్రితం కశ్మీరులో కేవలం కశ్మీరీ పండిట్లు మాత్రమే ఉండేవారని, ఆ తర్వాత వారు ఇస్లాంలోకి మారారంటూ ఆజాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత వారం దోడా జిల్లా పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఆజాద్ వ్యాఖ్యలు సానుకూల సంకేతమని, హిందూత్వ సంస్థల అభిప్రాయానికి ఇవి దగ్గరగా ఉన్నాయని బజరంగ్ దళ్ జాతీయ కన్వీనర్ నీరజ్ దైరేరియా తెలిపారు. దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు హిందూ మతంలోనుంచే మారిపోయారన్న బజరంగ్ దళ్ ఎప్పటి నుంచో చేస్తున్న వాదనకు గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలు సానుకూల సంకేతమని దౌనేరియా చెప్పారు.
కశ్మీరీ ముస్లింలు హిందువులేనని, ఇస్లాం కన్నా హిందూ మతం ఎంతో పురాతనమైనదంటూ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానని విహెచ్పి జాతీయ ప్రధాన కార్యదర్శి వినయాక్రావు దేశ్పాండే పేర్కొన్నారు.
బిజెపి సీనియర్ నాయకుడు కవీందర్ గుప్తా కూడా ఆజాద్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. దురాక్రమణదారులు ఇతర మతాలను భారత్లోకి తీసుకురాక పూర్వమే హిందూమతాన్ని ప్రజలు దేశంలో ఆచరిస్తున్నారని ఆయన తెలిపారు. 600 ఏళ్ల క్రితం కశ్మీరులో ఉన్నవారందరూ కశ్మీరీ పండిట్లేనని, ఆ తర్వాతే వారంతా ఇస్లాంలోకి మతమార్పిడి చేసుకున్నారని ఆజాద్ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలని ఆయన చెప్పారు.
భారతీయ ముస్లింలలో అత్యధిక శాతం మంది హిదూత్వం నుంచి మతం మారినవారేనని ఆజాద్ పేర్కొనడం పట్ల వీరంతా హర్షం ప్రకటించారు. కొందరు ముస్లింలు వెలుపలి నుంచి భారత్కు వచ్చారని, మరి కొందరు ముఘల్ రాజులతోపాటు సైన్యంగా వచ్చి ఉంటారని, చాలామంది హిందువులు, సిక్కులుగా ఉండి మతం మార్చుకుని ఉంటారని ఒక బిజెపి నాయకుడు తనతో అన్నారని ఆజాద్ ఈ సందర్భంగా తెలిపారు.
ఇందుకు పెద్ద ఉదాహరణ కశ్మీరని ఆయన చెప్పారు. 600 ఏళ్ల క్రితం కశ్మీరులో ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు. అప్పుడంతా కశ్మీరీ పండిట్లేనని, ఆ తర్వాత వారే ఇస్లాంలోకి మారారని ఆయన చెప్పారు. అయితే తన రాజకీయాలు మతం ఆధారంగా ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.
తన రాజకీయాలలో మతానికి స్థానమే లేదని ఆజాద్ అన్నారు. జమ్మూ కశ్మీరు అభివృద్ధి కోసం హిందువులు, ముస్లింలు కలసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓట్ల కోసం మతాన్ని వాడుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. మత రాజకీయాలు ఎవరు చేసినా వారు బలహీనులేనని ఆయన వ్యాఖ్యానించారు. హిందువులు, ముస్లిం పేర్ల ఆధారంగా వోటింగ్ జరగరాదని ఆయన చెప్పారు.