2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ లో తమకు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న అమేథీ నుంచే మళ్లీ పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు అజయ్ రాయ్ వెల్లడించారు. అలాగే, ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసి నుంచి, మోదీకి పోటీగా కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తే ఆమె గెలుపునకు ప్రతీ కార్యకర్త కృషి చేస్తారని ప్రకటించారు.
2019 లో కూడా రాహుల్ గాంధీ అమెథీ నుంచే పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే 2019లో రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గంతో పాటు కేరళలోని వాయనాడు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. ఆమెథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన రాహుల్ గాంధీ వాయనాడులో మాత్రం గెలుపొంది లోక్ సభకు కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యారు.
2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ మరోసారి యూపీలోని అమేథీ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని అజయ్ రాయ్ వెల్లడించారు. అయితే ఈ విషయమై పార్టీ నుంచి అధికారిక సమాచారం ఏది రాలేదు. 2019 ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా బరిలో నిలిచిన సినీనటి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ 55 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా ఒకవేళ రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తే మళ్లీ ఆయన బీజేపీ అభ్యర్థి ఇరానీ తోనే తలపడాల్సే అవకాశం ఉంది. నిజానికి అమేథీ నియోజకవర్గం గాంధీ నెహ్రూ కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటగా నిలిచింది. కాంగ్రెస్ కి ఉత్తర్ ప్రదేశ్ లో అమేథీ, రాయబరేలి నియోజకవర్గాలు అత్యంత విశ్వసనీయమైనవి.
ఆమేథీ నుంచి గతంలో సోనియా గాంధీ కూడా గెలుపొందారు. కాగా, ప్రియాంక గాంధీ కూడా 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆమె కోరుకుంటే యూపీలోని ఏ నియోజకవర్గం నుంచి అయినా ఆమె పోటీ చేయవచ్చని తెలిపాయి. ఒకవేళ ప్రియాంక గాంధీ వారణాసి స్థానం నుంచి పోటీ చేస్తే ఆమె గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేస్తాడని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ తెలిపారు.
2014, అలాగే 2019 లోక్ సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసి గెలుపొందారు. ప్రియాంక గాంధీ అమేథీ లేదా సుల్తాన్ పూర్ స్థానాల్లో ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమె భర్త రాబర్ట్ వాద్రా కోరుకుంటున్నట్టు సమాచారం. ప్రియాంక లోక్ సభకు ఎన్నిక కావాలని తాను కోరుకుంటున్నానని గతంలో పలుమార్లు రాబర్ట్ వాద్రా వ్యాఖ్యానించారు.