కాంట్రాక్ట్ ఎఎన్ఎంలను క్రమబద్ధీకరించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు వద్ద చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరణపై దృష్టిపెట్టాలని కోరారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ కి లక్ష రూపాయలు జీతం వస్తే అదే పని చేస్తున్న కాంట్రాక్ట్ ఎఎన్ఎం లకు కేవలం రూ. 25 వేలు మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేశారు.
ఎటుకాని దిక్కులేని పక్షులుగా కాంట్రాక్ట్ ఉద్యోగుల బతుకులు మారాయాని అంటూ వీరికి వెంటనే అన్ని సుదుపాయాలు కల్పించాలని కోరారు. “తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పదే పదే చెప్పేవారు. ప్రభుత్వమే వెట్టి చాకిరి చేయించుకుంటే ఎలా ? కంచే చేను మేస్తే ఎలా ? అనేవారు. కాంట్రాక్ట్ నర్సు, కాంట్రాక్ట్ టీచర్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇలా అందరినీ కాంట్రాక్ట్ పెడితే… ముఖ్యమంత్రి పదవి కూడా కాంట్రాక్ట్ ఇద్ధామా అని స్వయంగా కేసీఆర్ అన్నార” అని గుర్తు చేశారు.
“వైద్య శాఖలో పని చేస్తున్నా కూడా.. అమ్మ నాన్నకు కూడా వైద్యం చేయించలేని దుస్థితి వీరిది. పిల్లలకు ఏదన్నా అయితే పుస్తెల తాల్లు కాళ్ళమీద పెట్టీ వైద్యం చేయించుకునే దయనీయమైన పరిస్థితి. వీరికి హెల్త్ కార్డులు లేవు, పెన్షన్ లేదు, చనిపోతే కనీసం అంత్యక్రియలకు డబ్బులు కూడా ఇవ్వడం లేదు. ప్రమాద వశాత్తూ పోతే లేదా చనిపోతే కారుణ్య నియామకాలు లేవు” అని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.
వీరందరీనీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేశారని ఈటల గుర్తు చేశారు. 23 ఏళ్లుగా పని చేస్తున్నారని, ఏ సీఎం అయినా తమని పర్మినెంట్ చేయకపోతారా ? అని ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. “కేసిఆర్ మాటలు వింటే అబ్బ ఈయన ఇంతకు ముందే ఎందుకు సీఎం కాలేదు అన్నట్టు మాట్లాడతారు. కానీ పనులు మాత్రం చెయ్యరు” అంటూ ధ్వజమెత్తారు.