కరోనా మహమ్మారి కాలం ముందుకన్నా ఇప్పుడు దేశ ఆర్థికాభివృద్ధి వేగంగా జరుగుతున్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నూతన సంవత్సరం రోజున ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద విడుదల చేసిన రూ 29,900 కోట్ల నిధులను 10.09 కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాలలో జమచేసి సందర్భంగా ప్రసంగిస్తూ ప్రస్తుతం మన ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటు 8 శాతానికి పైగా ఉందని చెప్పారు.
రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నాయని చెబుతూ జిఎస్టి రాబడిలో గత రికార్డులు బద్దలవుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త లక్ష్యాలు నిర్ధేశించుకున్నామని అంటూ 2021లో కేవలం యూపిఐ ద్వారానే రూ.70వేలకోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్టు తెలిపారు.
ఇప్పడు 50 వేలకు పైగా అంకుర సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు. అందులో గత 6 నెలల్లోనే 10 వేల అంకురాలు నమోదయ్యాయని తెలిపారు. పర్యావరణ మార్పులపై ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నామని చెబుతూ 2070 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తొలగించాలనేది లక్షంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. అదే విధంగా విద్యుత్ వాహనాల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.
2021లో అమ్మాయిల వివాహ వయస్సు 18 నుంచి 21 ఏళ్లకు పెంచామని చెబుతూ దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు పిఎం గతిశక్తి జాతీయ బృహత్తర ప్రణాళిక ఒక రూపు తీసుకురానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మేక్ఇన్ ఇండియాకు కొత్త మార్గాలు చూపుతూ చిప్ , సెమి కండక్టర్ల తయారీ కోసం ప్రత్యేక పథకాలు తీసుకోచ్చామని చెప్పారు.
ముందు జాగ్రత్త అప్రమత్తతతో కరోనాపై దేశం పోరాటం చేస్తుందని పేర్కొంటూ జాతీయ ప్రయోజనాలను కాపాడుతామని భరోసా ఇచ్చారు. ఆరోగ్యం, రక్షణ, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో 2021లో సాధించిన విజయాలను ప్రధాని ప్రజలకు వివరించారు. దేశంలో రూ.145 కోట్లు కరోనా టీకా డోసులు అందించినట్లు తెలిపారు.
కరోనా వైరస్ పలు సవాళ్లను ఇచ్చినా దేశ అబివృద్ధిని అడ్డుకోలేదని ప్రధాని స్పష్టం చేశారు. కరోనా సయయంలో దేశంలోని 80 కోట్ల మంది లబ్దిదారులకు రూ.2.6లక్షల కోట్ల విలువైన ఆహారధాన్యాలను ఉచితంగా అందించినట్లు గుర్తు చేశారు. రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళాలని ఆయన సూచించారు.
అటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని ప్రధాని మోడి రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు ,వ్యవసాయశాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.