సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల తీవ్రత, రీచ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. దీని వల్ల ఎదురయ్యే పర్యవసానాలను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. 2018లో మహిళా జర్నలిస్టులను కించపరిచేలా నటుడు, తమిళనాడుకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ శేఖర్ ఫేస్బుక్లో పెట్టిన పోస్టుపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరూతు ఆయన వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు జులై 14న తిరస్కరించింది. దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
ఈ వ్యాజ్యంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టి ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇదే సమయంలో సోషల్ మీడియా వినియోగదారులకు కీలక సూచనలు చేసింది. ‘ఎవరైనా సోషల్ మీడియాను ఉపయోగిస్తే దాని ప్రభావం.. రీచ్ గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని పిటిషనర్ తరఫు న్యాయవాదికి ధర్మాసనం తెలిపింది.
తన క్లయింట్ కంటి అనారోగ్యానికి మందులు వేసుకోవడం వల్ల ఆ రోజున షేర్ చేసిన పోస్ట్‌లోని విషయాలను సరిగ్గా చదవలేకపోయాడని మాజీ ఎమ్మెల్యే తరఫు లాయర్ వాదించారు. ఈ సందర్భంగా ధర్మాసం జోక్యం చేసుకుంటూ సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. సోషల్ మీడియాను ఉపయోగించడం తప్పనిసరి అని ఎవరైనా భావిస్తే దాని పర్యవసానాలను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.
ఇక, 2018 ఏప్రిల్ 19న మహిళా జర్నలిస్ట్‌లను కించపరిచేలా అభ్యంతరకమైన పోస్ట్ పెట్టినట్టు హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పోస్ట్‌పై మహిళా జర్నలిస్ట్‌లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, పోస్ట్ తీవ్రత గురించి అంచనా వేయలేకపోయినట్టు శేఖర్ తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. తన పోస్ట్‌పై దుమారం రేగడంతో ఆయన కొద్ది గంటల్లోనే దానిని ఫేస్బుక్ నుంచి తొలగించారని వివరించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ తాను చేసిన పనికి క్షమాపణలు చెబుతూ అఫిడ్‌విట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
‘ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్‌ను క్షుణ్ణంగా చదివితే మహిళా జర్నలిస్ట్‌లను కించపరిచేవిగా ఉన్నాయి. ఇవి చాలా నీచమైన పదాలు. తమిళనాడులో మొత్తం పత్రికలకు వ్యతిరేకంగా కంటెంట్ చాలా అవమానకరంగా ఉంది’ అంటూ స్పష్టం చేసింది.
`ప్రస్తుతం మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం.. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి జీవితాన్ని ఇది ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో పెట్టే ఏ మెసేజ్ లేదా పోస్ట్ ప్రపంచ నలుమూలలకు క్షణాల్లో చేరిపోతుంది. ఇందులో చేసే ప్రకటనలు, పెట్టే పోస్ట్‌ల విషయంలో అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలి’ అని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది.