మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లకు సంబంధించి రూ.144.83 కోట్ల మేర కుంభకోణం జరిగిందని కేంద్రం గుర్తించింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఆదేశించారు. ఐదేళ్ల వ్యవధిలో వందలాది విద్యాసంస్థల్లో ఈ అవకతవకలు చోటు చేసుకున్నట్లు మైనారిటీ శాఖ అంతర్గత విచారణలో గుర్తించినట్లు సమాచారం.
మొత్తం 34 రాష్ట్రాల్లోని 100 జిల్లాల్లో 1,572 విద్యాసంస్థలలో తనిఖీ చేపట్టగా, 21 రాష్ట్రాల్లోని 830 సంస్థల్లో అవినీతి జరిగినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో సదరు విద్యాసంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఒకటో తరగతి నుంచి ఉన్నత విద్య వరకూ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షి్పలను ఇచ్చే పథకాన్ని 2007-08లో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోని 1.8 లక్షల విద్యాసంస్థలకు ఈ పథకం వర్తిస్తోంది. అయితే, ఇది భారీ ఎత్తున దుర్వినియోగం అయ్యిందని, లబ్ధిదారుల్లో 53 శాతం మంది నకిలీ వ్యక్తులేనని కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ దర్యాప్తులో బయటపడింది.
ఉనికిలోనే లేని కొన్ని విద్యాసంస్థలు కూడా ఈ పథకం కింద నిధులను దక్కించుకున్నాయని, అనేక విద్యాసంస్థలు తప్పుడు ఆధార్, కేవైసీ డాక్యుమెంట్లతో స్కాలర్షి్పలను తీసుకున్నాయని తెలిసింది. దీనిపై జూలై 10న మైనారిటీ శాఖ అధికారికంగా ఒక ఫిర్యాదు కూడా ఇచ్చినట్లు సమాచారం. తాజాగా ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని మంత్రి స్మృతీ ఇరానీ ఆదేశాలు జారీ చేశారు.