నిన్న మొన్నటి వరకు టమాటా ధరలు మండిపోగా, ఇప్పుడు ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. మార్కెట్ లో ఉల్లి ధరలను కంట్రోల్ చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఉల్లి ఎగుమతులపై డిసెంబర్ 31 వరకు 40 శాతం సుంకం విధించింది. దిల్లీలో ఉల్లి ధరలు అమాంతం పెరగడంతో వినియోగదారులకు ఉపశమనం కల్పించడానికి కిలో రూ.25 ధరకు విక్రయించాలని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.
సోమవారం నుంచి దిల్లీలో ఉల్లి కేజీ రూ. 25కి విక్రయించనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 3 లక్షల టన్నుల ఉల్లి బఫర్ స్టాక్‌ను సిద్ధం చేసింది. ఈ ఏడాది బఫర్ స్టాక్ కోసం అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిని సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. దిల్లీలో సోమవారం నుంచి 10 మొబైల్ వ్యాన్లలో ఉల్లిపాయలు విక్రయించనున్నారు.
క్రమంగా వీటిని మరిన్ని ప్రాంతాలకు కూడా విస్తరించనున్నారు. మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్న క్రమంలో ఇతర రాష్ట్రాల్లోనూ తక్కువ ధరకే ఉల్లి విక్రయాలు చేయనున్నట్లు సమాచారం. ఉల్లి బఫర్ స్టాక్ ను సోమవారం నుంచి దిల్లీలో సబ్సిడీపై విక్రయించనున్నట్లు ఎన్సీసీఎఫ్ తెలిపింది. 10 మొబైల్ వ్యాన్లు, రెండు రిటైల్ దుకాణాల ద్వారా కిలో ఉల్లిని రూ.25కి విక్రయిస్తున్నారు.
మరోవైపు ఉల్లిని ఆన్లైన్ ద్వారా కూడా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్‌లో సబ్సిడీ ధరలకు ఉల్లిని విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో బఫర్ స్టాక్ ను అందుబాటులోకి తెస్తే దిల్లీ సహా ఏపీ, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, అస్సాంలో ఉల్లి కొరత తగ్గుతుందని పేర్కొన్నారు.
దిల్లీలో సోమవారం నుంచి ఉల్లి విక్రయాలు ప్రారంభిస్తామని ఎన్సీసీఎఫ్ అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల తర్వాత మిగతా నాలుగు రాష్ట్రాల్లో విక్రయాలు మొదలు పెట్టనున్నట్టు ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే ఆదివారం నాటికి దేశంలో కిలో ఉల్లి సగటు ధర 19 శాతం పెరిగి రూ.29.73గా కొనసాగుతోంది. దిల్లీలో ఉల్లి రిటైల్ ధర కిలో రూ.37గా ఉంది.
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన డేటా ప్రకారం, ఉల్లి సగటు రిటైల్ ధర శనివారం కిలోకు రూ. 30.72గా ఉంది. గరిష్ట ధర కిలో రూ. 63 కాగా, కనిష్టంగా కిలో రూ. 10 ఉంది. గణాంకాల ప్రకారం దిల్లీలో శనివారం ఉల్లి కిలో రూ.37గా ఉంది. దేశ రాజధానిలో కిలో ఉల్లి ధర రూ.50కి చేరినట్లు ట్రేడ్ డేటా వెల్లడించింది. లభ్యతను పెంచడానికి బఫర్ స్టాక్ నుంచి 3 లక్షల టన్నుల ఉల్లిని విక్రయిస్తామని కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది.