తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ లో అసమ్మతి సెగ మొదలైంది. సోమవారం పార్టీ అధినేత అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 119 మందికి గాను 115 అభ్యర్థులను ప్రకటించారు. మరో నలుగుర్ని హోల్డ్ లో పెట్టారు. ఈ క్రమంలో టికెట్ దక్కని వారు అధికార పార్టీ కి రాజీనామా చేసి..మరో పార్టీ వైపు చూస్తున్నారు.
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ పార్టీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆమెకు టికెట్ దక్కలేదు. దీనితో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో రేఖా నాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ సోమవారం సాయంత్రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావ్ థాకరేను కలుసుకున్నారు. ఆయన చేతుల మీదుగా కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. దీనితో ఇక రేఖా నాయక్ కూడా కాంగ్రెస్‌లో చేరొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఖానాపూర్ ఎస్టీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి రేఖా నాయక్ వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. 2014, 2018లలో భారీ మెజారిటీతో తన ప్రత్యర్థి రమేష్ రాథోడ్‌ను మట్టికరిపించారు. 2014లో టీడీపీ తరఫున, 2018లో కాంగ్రెస్ తరఫున రమేష్ రాథోడ్ పోటీ చేసి, రేఖా నాయక్ చేతిలో ఓటమి చవి చూశారు.
ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఇటీవల రేఖా భర్త శ్యామ్ నాయక్ వీఆర్ఎస్ తీసుకున్నారు. అసలు ఎస్టీయే కాని జాన్సన్ నాయక్‌కు టికెట్ ఇచ్చారని రేఖా నాయక్ ఆరోపించారు. జాన్సన్ నాయక్ కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆయన ఎస్టీ ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఖానాపూర్‌లో తన సత్తా ఏమిటో చూపిస్తానని రేఖా నాయక్ స్పష్టం చేస్తున్నారు.
మరోవంక, అంబర్ పేట బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఎడ్ల సుధాకర్ రెడ్డి పార్టీ అధిష్టానం ఫై ఆగ్రహంగా ఉన్నారు. ప్రజలకు న్యాయం చేయని ఎమ్మెల్యేను మరోసారి ఎన్నుకునేందుకు సుముఖత చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని స్వరాష్ట్రం సాధించకున్నాక 2014లో తనకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు.
2018లో తన మిత్రుడు కాలేరు వెంకటేశ్‌కు అధిష్టానం టికెట్ ఇవ్వగా పార్టీ నేతలందరం కలిసి కట్టుగా గెలిపించుకున్నామని పేర్కొన్నారు. 2023లో తాను పోటీ చేస్తానని అధిష్టానానికి విన్నవించగా సానుకూలంగా స్పందించి.. మళ్లీ సిట్టింగ్‌కే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పేటలో గూండాయిజం, దోపిడీ, కబ్జాలకు పాల్పడటం తప్ప.. కాలేరు వెంకటేశ్ ఎమ్మెల్యేగా చేసిందేమీ లేదని ఆరోపించారు.