బ్రిక్స్ సభ్య దేశాలు భవిష్యత్తులో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి వ్యవస్థీకృత అభివృద్ధిని సమీక్షించుకోవడానికి జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న సమావేశం కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి దక్షిణాఫ్రికాకు పయనమయ్యారు.
ఈసారి బ్రిక్స్ సమావేశం వివిధ రంగాల్లో సభ్య దేశాల మధ్య బలమైన సహకారానికి సంబంధించిన అజెండాను పరిశీలిస్తుందని వెల్లడించారు. “పేద దేశాలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు బహుళ పక్ష వ్యవస్థల సంస్కరణలను చర్చించడానికి బ్రిక్స్ విలువైన వేదికగా మారిందని భావిస్తున్నాను” అని ప్రధాని తన ప్రకటనలో పేర్కొన్నారు.
అనంతరం ప్రధాని ఎక్స్ (ట్విటర్)లో ఓ పోస్ట్ చేశారు. జొహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్తున్నాను. బ్రిక్స్ ఆఫ్రికా, బ్రిక్స్‌ప్లస్ సమావేశాలు కూడా జరగనున్నాయి. పేద దేశాల సమస్యలు, ఇతర అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు ఇది వేదికగా మారింది” అని ట్వీట్లో పేర్కొన్నారు.
ప్రధాని మోదీ 15వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం గ్రీస్ పర్యటనకు వెళ్తారు. 2019 తర్వాత బ్రిక్స్ దేశాధినేతలు వ్యక్తిగతంగా హాజరవుతున్న తొలి సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరవుతున్నారు. పుతిన్ బదులు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ సదస్సులో పాల్గొంటారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య సమావేశం జరగనుందా లేదా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.