చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇస్రో పంపించిన ‘విక్రమ్’ల్యాండర్ విజయవంతంగా దిగడం యావద్భారతం గర్వించే క్షణమని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి హర్షం ప్రకటించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా భారత్ నిలిచిందని పేర్కొన్నారు.
బుధవారం చంద్రయాన్-3 ల్యాండ్ అయిన అద్వితీయమైన ఘట్టాలను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్, ఇతర ముఖ్యనేతలతో కలిసి భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై కిషన్ రెడ్డి వీక్షించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని వీక్షించారు. పార్టీ కార్యాలయంలో నాయకులు త్రివర్ణతాకాలు చేతబూని భారత్ మాతాకీ జై, జై జవాన్ జై కిసాన్ – జై విజ్ఞాన్ నినాదాలు చేశారు. టపాసులు కాల్చారు.
అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ ఈ విజయంతో భారత్ కొత్త చరిత్రను లిఖించిందని కొనియాడారు. ఇస్రో, చంద్రయాన్ బృందానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతి భారతీయుడూ గర్వపడేలా చేశారని అభినందనలు తెలిపారు.
ప్రధాని మోదీ కి, 140 కోట్ల మంది భారతీయులకు హృదయపూర్వకంగా అభినందనలను కిషన్‌రెడ్డి తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్ తదితరులు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారు
అవినీతి, అహంకారపూరిత, నియంతృత్వ పూరిత ప్రభుత్వం పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం చేవెళ్ల (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ బూత్ సమ్మేళంలో పాల్గొనేందుకు చేవెళ్లకు విచ్చేసిన ఆయనకు, బండి సంజయ్ కు స్థానిక కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు.
భారీ ఎత్తున హాజరైన కార్యకర్తలకు ఓపెన్ టాప్ జీప్ ఎక్కి అభివాదం చేస్తూ సమావేశానికి మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కర్ణాటక ఎమ్మెల్యే చంద్రప్పలతో కలిసి విచ్చేశారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే.. జర్నలిస్టులు, యువత, రైతులు, మహిళలు, డాక్టర్లు, కార్మికులు.. ఇలా సకలజనులు సమ్మెచేసి తెలంగాణ సాధించుకుంటే.. నాతోనే తెలంగాణ వచ్చిందని చెబుతూ, ఉద్యమకారులను అవమాన పరుస్తున్న నాయకుడు కెసిఆర్ అని ధ్వజమెత్తారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో బిజెపి నేతృత్వంలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు ముట్టడి చేస్తుంటే ప్రజలపై, బిజెపి కార్యకర్తలపై పోలీసు దమనకాండ కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆగస్టు 24న రాష్ట్ర మంత్రుల కార్యాలయాలు ఘెరావ్ కార్యక్రమం, 25న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
క్యాన్సర్ మూడో దశకు చేరితే ఎంత డేంజరో బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే అంతకంటే డేంజర్ అంటూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ హెచ్చరించారు. మొదటిసారి అధికారంలోకి వచ్చి మోసం చేసిండు.. రెండోసారి అధికారంలోకి వచ్చి భూములన్నీ అమ్మేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండు. మూడోసారి వస్తే ఇక అంతే అని వారించారు. బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను చూస్తే దండుపాళ్యం ముఠా గుర్తుకొస్తుందని ధ్వజమెత్తారు.