ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణపై దృష్టి సారిస్తున్నది. ఇందులో భాగంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆగస్టు 27న ఖమ్మం వేదికగా తలపెట్టిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది.
సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ సభతోనే ఎన్నికల యుద్ధంలోకి దిగాలని బీజేపీ భావిస్తోంది. ఆగస్టు 27వ తేదీన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు అమిత్ షా. అక్కడి నుంచి హెలికాప్టర్లో 2 గంటల 10 నిమిషాలకు కొత్తగూడెంకు వస్తారు. రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకుంటారు.
2.25 గంటల నుంచి 2.40 గంటల వరకు భద్రాద్రి రాములోరి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కొత్తగూడెం నుంచి 2.55 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 3.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు.
ఆ తర్వాత ‘రైతు గోస-బీజేపీ భరోసా’లో పాల్గొని ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. నిజానికి గతంలోనే ఖమ్మంలోనే సభను నిర్వహించేందుకు సిద్ధమైంది బీజేపీ. కానీ వర్షాల కారణంగా అమిత్ షా పర్యటన రెండు సార్లు రద్దైంది.
ఇక మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా . కాంగ్రెస్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా పై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖారులోగా తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
అమిత్ షా సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని బీజేపీ తెలంగాణ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే టార్గెట్ గా అమిత్ షా ప్రసంగం ఉండే అవకాశం ఉంది.