సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య ఎల్-1 మిషన్‌పై లాంచ్ చేసే అవకాశం ఉందని ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ వెల్లడించారు. అయితే, లాంచ్‌కు సంబంధించి తుది తేదీని ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. ఆదిత్య ఎల్-1 మిషన్‌ను నింగిలోకి పంపాక.. లాగ్రాంజ్ పాయింట్‌కు చేరుకునేందుకు 125 రోజులు పడుతుందని సోమ్‌నాథ్ వివరించారు.
చంద్రయాన్-3 నుంచి భారీ విషయాన్ని ఆశిస్తున్నట్లు ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ అన్నారు. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై విజయవంతంకావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్షంలో విస్తరించి దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లడమే ఇస్రో లక్ష్యమని చెప్పారు. ఇప్పుడు భారత్ మరిన్ని గ్రహాలపై మిషన్లను ప్రారంభించే సామర్థ్యాన్ని కలిగి ఉందని మీడియాకు తెలిపారు.
అంగారకుడితో సహా శుక్రుడిపై పరిశోధనలు చేపట్టగలమని, ఇందుకు మరింత విశ్వాసం పెట్టుబడులు అవసరమన్నారు. స్పేస్ సెక్టార్లో విస్తరించి.. భారతదేశాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందన్నారు. చంద్రుడికి సంబంధించి రోవర్ పంపే మరిన్ని చిత్రాల కోసం ఇస్రో బృందం ఎదురుచూస్తోందని, ప్రస్తుతం చంద్రుడిపై శాస్త్రీయ అధ్యయనం, పరిశోధనలపై ఎక్కువ దృష్టి పెడుతున్నామన్నారు.
సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇది. 1500 కిలోల బరువున్న శాటిలైట్ ఆదిత్య ఎల్1. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1(ఎల్ 1) చుట్టూ ఉన్న కక్షలో దీన్ని ప్రవేశ పెట్టనున్నారు. ఈ కక్ష లోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది.
ఆదిత్య ఎల్1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్ల నుంది. ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రాఫ్ (వీఈఎల్సీ) తోపాటు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ , ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ , ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య , సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ పేలోడ్లను అమర్చనున్నారు.
సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడి లోని పొరలైన ఫొటోస్ఫియర్, క్రోమోస్ఫియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. ఎల్ 1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్టా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు సాధనాలు … సమీపం లోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.