తిరుమల నడక దారిలో మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి నడక మార్గంలో.. ఏడవ మైలు దగ్గర ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుత చిక్కింది. ఇప్పటి వరకు నాలుగు చిరుతల్ని బంధించగా.. దీంతో ఆపరేషన్ చిరుత ముగిసినట్లు చెబుతున్నారు. జూన్ నెలలో ఓ చిరుతను బంధించగా, ఆగస్టు 14న ఓ చిరుత చిక్కగా, ఆగస్టు 17న మరో చిరుత బోనులో పడింది.
తాజాగా మరో చిరుత బోనులో దొరికింది.. నాలుగు చిరుతలు బోనులో పడటంతో టీటీడీతో పాటుగా భక్తులకు ఊరట అని చెప్పాలి. అటవీశాఖ అధికారులు నాలుగో చిరుతను బోనులో బంధించేందుకు వారం రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత కూడా రోజూ బోను వరకు వచ్చి వెనుదిరుగుతున్నట్లు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో గుర్తించారు.
అయితే ఆదివారం రాత్రి ఎట్టకేలకు బోనులో చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో అటవీశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరో ఎలుగుబంటిని కూడా ట్రాప్ చేసే పనిలో ఉన్నారు. ఆ ఎలుగు కూడా బోనులో చిక్కకుండా అటవీశాఖ అధికారుల్ని ముప్పు తిప్పలు పెడుతోంది. అది కూడా దొరికితే నడక మార్గంలో జంతువుల సంచారం దాదాపు లేనట్లే అంటున్నారు.
ఆగస్టు 12న నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన చిన్నారి లక్షితను తిరుమల నడక మార్గంలో చిరుత లాక్కెళ్లి దారుణంగా చంపేసింది. ఈ ఘటనతో టీటీడీ, అటవీశాఖ అధికారులు కలిసి ఆపరేషన్ చిరుత ప్రారంభించారు. ప్రత్యేకంగా బోనుల్ని తెప్పించి చిరుతల్ని బంధించేందుకు ఆపరేషన్ ప్రారంభించారు. ఈ నాలుగు చిరుతల్లో ఒకదానిని దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేయగా.. మిగిలిన మూడింటిని తిరుపతిలోని జూ పార్క్‌కు తరలించారు.