వాగ్నర్ కిరాయి సేనల చీఫ్ యెవెగ్నీ ప్రిగోజిన్ (62) మృతిపై రష్యా ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. మాస్కో శివార్లలో ఇటీవల కూలిన విమానంలో మృతి చెందిన వారిలో ఆయన కూడా ఉన్నట్లు దేశ దర్యాప్తు సంస్థ ప్రకటించింది.
ప్రమాదంలో ప్రాణాలకు కోల్పోయిన 10మందికీ జన్యుపరీక్షలు నిర్వహించామని, వారిలో వాగ్నర్ గ్రూపు నాయకుడు కూడా ఉన్నట్లు ధ్రువీకరించుకున్నామని స్పష్టం చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రిగోజిన్ మృతిని రష్యా అధికారికంగా వెల్లడించని సంగతి తెలిసిందే.
ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటనా స్థలిలో దొరికిన పది మృతదేహాలను గుర్తించారు. వారి పూర్వాపరాలను అధికారిక రికార్డుల మేరకు ధృవీకరించుకున్నారని ప్రకటనలో తెలిపారు. ఈ విమాన ప్రమాదం వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ హస్తం ఉందంటూ పశ్చిమ దేశాలు ఆరోపిస్తుండగా.. ఆయన దాన్ని ఖండిస్తున్నారు.