సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ విశ్వవిఖ్యాతుడని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు.ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి సోమవారం రాష్త్రపతి భవన్ లో విడుదల చేశారు. ఈసందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భారతీయ సినిమా చరిత్రలో నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు.
రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని చెబుతూ భారత చలనచిత్ర రంగం పురోగతిలో ఎన్టీఆర్ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రలతో ఆయన ప్రజల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. దేవుళ్ల రూపాలను ప్రజలు ఎన్టీఆర్ లో చూసుకున్నారని తెలిపారు.
రాజకీయాల్లో సైతం ఎన్టీఆర్ ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు. పేద ప్రజల ఉన్నతి కోసం ఆయన తపించారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఎన్టీఆర్ స్మారక నాణెంను ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ కుమార్తె, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ కృష్ణుడి రూపంలో ఉన్న జ్ఞాపికను పురందేశ్వరి రాష్ట్రపతికి అందచేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ రంగాల్లో ఆయనతో కలిసి పనిచేసిన సన్నిహితులు హాజరయ్యారు.
టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కె.రామ్మోహన్నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్టీఆర్ వెన్నంటి ఉన్న అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కంభంపాటి రామ్మోహన్రావు, ఎద్దులపల్లి సుబ్రహ్మణ్యం తదితర సీనియర్ నాయకులు, సినీ నిర్మాతలు చలసాని అశ్వినీదత్, దగ్గుబాటి సురేశ్, విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్యతోపాటు సుమారు 200 మంది అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.