స్కూళ్లలో స్మార్ట్ ఫోన్ల వాడడంపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. టీచర్లు తరగతి గదుల్లోకి తమ మొబైల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావకూడదని స్పష్టం చేసింది ఏపీ విద్యాశాఖ. టీచర్లు క్లాస్ రూముల్లోకి వెళ్లే ముందు తమ ఫోన్లను హెడ్ మాస్టర్లకు అప్పగించాలని తెలిపింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. చాలా మంది ఉపాధ్యాయులు తమ మొబైల్ ఫోన్లను వ్యక్తిగత పనులకు వాడుతున్నారన్న ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసకున్నారు. స్కూళ్లలో బోధనా ప్రమాణాల పెంపునకు స్మార్ట్ ఫోన్ల వినియోగం ఆటంకంగా మారిందని విద్యాశాఖ చెబుతోంది.
కొత్తగా తీసుకువచ్చిన ఈ నిబంధన కఠినంగా అమలయ్యేలా అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేడీలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు అధికారులు. యునెస్కో 2003 లో ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఆగస్టు మూడో తేదీన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించిన సమావేశంలో నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరించారు.
స్కూళ్లలో టెక్నాలజీ వినియోగం-గుడ్ గవర్నెన్స్‌కు సంబంధించి విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నిపుణుల నుంచి సేకరించిన అభిప్రాయాలకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్లతో విద్యార్ధుల అకడమిక్ పెర్మార్మెన్స్కు కు నష్టం కలుగుతుందన్న కారణంతో తరగతి గదుల్లో స్మార్ట్ ఫోన్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది.
టీచింగ్ టైమ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ వాడకూడదని ఆదేశాల్లో పేర్కొంది. తరగతిలో విద్యార్ధుల హాజరు తీసుకున్న తర్వాత మొబైల్ ఫోన్ లను సైలెంట్ లో ఉంచి ప్రధానోపాధ్యాయుడికి అప్పగించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ టీచింగ్ అవసరాల కోసం స్మార్ట్ ఫోన్ ను క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్తే ముందుగానే హెచ్ఎం అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.
టీచర్లు ఉదయం తొమ్మిదిన్నరకు ముందు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే సెల్ ఫోన్ వినియోగించాల్సి ఉంటుందని ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. మొదటి సారి ఈ నిబంధన ఉల్లంఘిస్తే మరోసారి ఇలా చేయమని సంబంధిత హెచ్ఎం కు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
రెండోసారి ఇలానే జరిగితే మండల విద్యాశాఖాధికారితో మాట్లాడిన తర్వాత మాత్రమే సెల్ ఫోన్ తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. అయితే, మూడో సారి ఇదే పొరపాటు తిరిగి చేస్తే ఉపాధ్యాయుడి సెల్ ఫోన్‌ను డీఈవోకు సరెండర్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. డీఈవోతో చర్చించి సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేసి సెల్ ఫోన్ తీసుకోవాల్సి ఉంటుంది.