నీట్-పిజి అడ్మిషన్లలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఇడబ్ల్యుఎస్) కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితుల్లో మార్పులేమీ లేవని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆదాయ పరిమితిని రూ. 8 లక్షలుగానే ఉంచనున్నట్లు తెలిపింది.
నీట్-పిజి పరీక్షల్లో ఇడబ్ల్యుఎస్లకు రిజర్వేషన్లు కల్పించిన అంశంపై సుప్రీంకోర్టు ఈ నెల 6న విచారణ జరగనుండగా.. కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అడ్మిషన్లు, సీట్ల కేటాయింపులు కొనసాగుతున్న ఈ సమయంలో నిబంధనల్ని మార్చడం వల్ల సమస్యలు ఏర్పడవచ్చునని పేర్కొంది.
అయితే, వచ్చే ఏడాది సవరణలు చేస్తామని తెలిపింది. ఈ వివాదంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సిఫార్సులను అంగీకరిస్తున్నామని పేర్కొంది. రిజర్వేషన్లు పొందడానికి వార్షిక ఆదాయ పరిమితి రూ. 8 లక్షలుగా ఉండాలని కమిటీ పేర్కొంది.
అదేవిధంగా ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ వర్తించదు. అయితే ఈ సిఫార్సులు ప్రస్తుతం కొనసాగుతున్న అడ్మిషన్ ప్రక్రియను మాత్రం ప్రభావితం చేయబోవని కమిటీ స్పష్టం చేసింది.
అదేవిధంగా ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ కోసం విధించిన రూ. 8 లక్షల ఆదాయ పరిమితిని కేంద్రం సమర్థించుకుంది. దీని వల్ల ఇప్పటి వరకు లబ్దిపొందిన విద్యార్థుల పూర్వాపరాలను కమిటీ పరిశీలించిందని అఫిడవిట్లో పేర్కొంది.
అనర్హులకు రిజర్వేషన్లు అందుతున్నాయన్న ఆందోళన ఉత్పన్నం కావడం లేదని తెలిపింది. ప్రస్తుతం దీని వల్ల లబ్దిపొందుతున్న వారిలో చాలా మంది రూ. 5 లక్షల లోపు ఆదాయం కల్గిన కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఉన్నారని తెలిపింది.