ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న రత్నభండార్ లోని లొపలి గదిని గురువారం మరోసారి తెరిచారు. ఆ గదిలో ఉన్న విలువైన వస్తువులను.. తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌కు తరలిస్తున్నారు. ఈ వారంలోనే రత్నభండార్‌ను తెరవడం ఇది రెండవసారి. ఉదయం 9.51 నిమిషాలకు ఆ గదిని తెరిచారు.
జగన్నాథుడికి పూజలు చేసిన తర్వాత ఒడిశా సర్కార్ నియమించిన సూపర్వైజరీ కమిటీ రత్నభండార్‌లోకి అడుగుపెట్టింది. జూలై 14వ తేదీన బయటి గదిలో ఉన్న అమూల్యమైన ఆభరణాలు, ఇతర వస్తువులను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం వరకు లొపలిగదిలోని ట్రెజరీ పెట్టలను తరలించనున్నట్లు కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వంత్ రాథ్ తెలిపారు.
పూరి రాజు గజపతి మహారాజ దివ్య సింగ్ దేబ్ సమక్షంలోనే ఆభరణాలు, విలువైన వస్తువులను స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తున్నారు. ఆభరణాల తరలింపు ప్రక్రియను వీడియో తీస్తున్నారు. పాములు పట్టేవాళ్లతో పాటు ప్రత్యేక భద్రతా సిబ్బంది ఆలయం వద్దే ఉన్నారు.
షెడ్యూల్ ప్రకారమే 11 మంది సభ్యులు బృందం రత్నభండార్‌లోని ఇన్నర్ ఛాంబర్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం లొపలి గదిలో ఉన్న ఆభరణాలు, వస్తువులను ఖటేషేజా రూమ్‌కు తరలించారు. తరలింపు పూర్తి అయిన తర్వాత ఆ రూమ్‌ను సీల్ చేయనున్నారు. ఆ తర్వాత లోపలి గదిలో పురావాస్తుశాఖ ఆధ్వర్యంలో రిపేర్ చేయనున్నారు. రిపేర్ వర్క్ పూర్తి అయిన తర్వాత.. ఇన్వెంటరీ వర్క్ మొదలవుతుందని పూరీ గజపతి మహారాజు దివ్యసింగ్ దేబ్ తెలిపారు.