లోక్సభ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్లో వచ్చినా ఆశ్చర్యం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రచారం కోసం అన్ని హెలికాప్టర్లను బీజేపీ ముందస్తుగా బుక్ చేసుకొందని, మరో పార్టీకి అవకాశం ఇవ్వొద్దనేది వారి ఆలోచన అని ఆమె వెల్లడించారు.
“పశ్చిమబెంగాల్లో సీపీఎం పాలనకు ముగింపు పలికాం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని తప్పకుండా ఓడిస్తాం. ఇప్పటికే అన్ని వర్గాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. మరోసారి అధికారం చేపడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. మూడోసారి బీజేపీ అధికారం లోకి వస్తే నిరంకుశ పాలనే ” అని ఆమె హెచ్చరించారు.
టిఎంసి యువజన విభాగం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ గవర్నర్ తీరుపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంతో సవాలుకు దిగవద్దని సూచించారు. గవర్నర్ పదవి అంటే తనకు గౌరవం ఉన్నప్పటికీ, ఆయన తీరు ఏమాత్రం బాగా లేదని ఆమె పేర్కొన్నారు. ఇటీవల జాదవ్ పూర్ యూనివర్శిటీలో చోటు చేసుకున్న వివాదంపైనా మమత స్పందిస్తూ గోలీ మారో అంటూ నినాదాలు చేసిన వారిని అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు.