ఫైబర్ కేబుల్ అవసరం లేకుండా తీసుకు వస్తోన్న జియో ఎయిర్ ఫైబర్‌ను వినాయక చవితికి (సెప్టెంబర్ 19న) ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ వెల్లడించారు. సంస్థ 46వ వార్షిక సాధారణ సదస్సులో వాటాదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ కీలక ప్రకటనలు చేశారు.
గత పదేళ్లలో కంపెనీ 150 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ముఖేశ్ వెల్లడించారు. ఇతర ఏ కార్పోరేట్ కంపెనీ ఈ స్థాయి పెట్టుబడులు పెట్టలేదని చెప్పారు. రిలయన్స్ కొత్త తరం టెక్నాలజీ కంపెనీగా అవతరించిందని పేర్కొన్నారు.
దేశంలో జియో యూజర్ల సంఖ్య 45 కోట్లు దాటినట్లు తెలిపారు. సగటు వినియోగం నెలకు 25 జీబీగా ఉందని తెలిపారు. 5 కోట్ల మంది జియో వినియోగదారులు 5జీ వినియోగిస్తున్నట్లు చెప్పారు. 2జీ వినియోగదారులను 4జీకి మార్చేందుకు జియో భారత్ ఫోన్‌ను కేవలం రూ.999కే తీసుకు వచ్చామని పేర్కొన్నారు.
దేశంలో అందరికీ 5జీ నెట్ వర్క్ అందించడమే లక్ష్యమని చెబుతూ డిసెంబర్ నాటికి అందిస్తామని వెల్లడించాయిరు. ఫైబర్ కేబుల్ అవసరంలేని జియో ఎయిర్ ఫైబర్‌ను వినాయక చవితికి లాంచ్ చేస్తున్నామని, సెప్టెంబర్ 19న దీనిని తీసుకు వస్తున్నామని ప్రకటించారు.
జియో సినిమా వేదికగా 45 కోట్ల మంది ఐపీఎల్ ప్రసారాలను వీక్షించారని, ఫైనల్ మ్యాచ్‌ను 12 కోట్ల మంది చూశారని చెప్పారు. రిలయన్స్ నికర లాభం పెరిగినట్లు తెలిపారు. బీమా రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ముఖేశ్ ప్రకటించారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా సాధారణ, ఆరోగ్య బీమా సేవలను అందిస్తామని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌లో 2.6 లక్షల ఉద్యోగులు చేరినట్లు తెలిపారు.