వంటగ్యాస్ సిలెండర్ (ఎల్పీజీ) ధరను తగ్గిస్తూ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మంగళవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. సిలెండర్ ధర రూ.200 తగ్గించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
తాజా తగ్గింపుతో పీఎం ఉజ్వల యోజన కింద పంపిణీ చేసే సిలెండర్లపై సబ్సిడీ రూ.400కు పెరిగింది. ఉజ్వల స్కీమ్ కింద గృహావసరాలకు వినియోగించే సబ్సిడీ ఎల్పీజీ సిలెండర్లను ఏడాదికి 12 వరకూ తీసుకోవచ్చు. 14.2 కిలోల ఎల్పీజీ సిలెండర్ ధర ప్రస్తుతం ఢిల్లీలో రూ.1,103గా ఉందని ఇండియన్ ఆయిల్ కంపెనీ తెలిపింది.
డొమిస్టిక్ ఎల్పీజీ సిలెండర్ల ధర రూ.200 తగ్గించాలని ప్రధానమంత్రి మోదీ నిర్ణయం తీసుకున్నారని, రక్షాబంధన్ కానుకగా దేశంలోని మహిళలందరికీ మోదీ ఇచ్చిన కానుక ఇదని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ సహా మొత్తం 5 రాష్ట్రాలకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎల్పీజీ సిలెండర్ ధరను కేంద్రం తగ్గించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉజ్వల యోజనలో భాగంగా 75 లక్షల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఆ మహిళలు గ్యాస్ స్టవ్, ఫస్ట్ సిలిండర్, పైప్ ఉచితంగా పొందుతారని చెప్పారు.
2014లో ప్రధాని మోదీ నేతృత్వంలో తాము అధికారంలోకి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా 14.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్స్ ఉండేవని, ఇప్పుడు అవి 33 కోట్లకు చేరాయని తెలిపారు. వాటిలో 9.6 కోట్ల కనెక్షన్లు ఉజ్వల యోజన పథకంలోనివని వివరించారు.