తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, అక్కడ గెలిచి తీరాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్ తొలిసారి ఈ భేటీకి హాజరయ్యారు.
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం ఎన్నికలపై చర్చించారు. దక్షిణాదిలో కర్ణాటకలో అధికారం కోల్పోయిన నేపథ్యంలో తెలంగాణలో అధికారంలోకి రావడం పార్టీకి ఎంతో అవసరమని నడ్డా అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రంలో భాజపాకు అనుకూల వాతావరణం ఉందని, దానిని సద్వినియోగం చేసుకుని గెలిచి తీరాలని నడ్డా తెలిపారు. ఈ విషయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్షులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కాగా, తెలంగాణలో బీజేపీ తరపున పోటీ చేసే వారి జాబితాను కుటుంబ పార్టీల తరహాలో నిర్ణయించలేమన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
బిఆర్ఎస్ కుటుంబ పార్టీ అని డైనింగ్ టేబుల్ మీద అభ్యర్థుల భవితవ్యాన్ని తాము నిర్ణయించలేమని ఆయన చెప్పారు. పార్టీ శ్రేణులతో విస్తృతంగా చర్చించిన తర్వాతే బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఎన్నికల కమిటీ వేశామని, ఆ కమిటీ సమావేశమైన తర్వాత అభ్యర్థుల ఎంపికతో పాటు ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటామి చెప్పారు.
తెలంగాణలో సెప్టెంబరు 17న రాష్ట్ర విమోచన దినోత్సవం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకులతో వివిధ రకాల యాత్రలు చేపట్టనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ యాత్రల్లో శాసనసభ నియోజకవర్గాల వారీగా ప్రజలను కలిసి అన్ని విషయాలపై చర్చిస్తామని చెప్పారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ విషయంలో అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని, ఈ విషయంలో కార్యకర్తలు ఆందోళన చెందాల్సి అవసరం లేదని కిషన్ రెడ్డి సూచించారు. ప్రధాని పిలుపు మేరకు పెట్రోల్‌పై అన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించి ధరలు తగ్గిస్తే తెలంగాణ ప్రభుత్వం పన్నులు తగ్గించకుండా ప్రజలపై భారం మోపిందని ఆరోపించారు.
ఇలా ఉండగా, బిఆర్ఎస్ తన అభ్యర్థులను ముందుగానే ప్రకటించినా బిజెపి ఈ విషయంలో తొందరపడే అవకాశాలు కనిపించడం లేదు. బిఆర్ఎస్ ముందే అభ్యర్థుల్ని ప్రకటించడం ప్రత్యర్థులను ట్రాప్ చేయడానికేనని బీజేపీ భావిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల ఖమ్మంలో పార్టీ నేతలతో సమావేశమైనపుడు తొందరపడి ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన అవసరంలేదని, పార్టీ నిర్దేశిత కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
సరైన సమయంలో బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తామని, అభ్యర్థులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని చెబుతున్నారు. తెలంగాణలో 19 ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు, 12 ఎస్టీ రిజర్వుడ్ స్థానాలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. వీటిలో బలమైన అభ్యర్థులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసింది. మిగిలిన నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాల ఆధారంగా తగిన వారిని బరిలోకి దించాలని యోచిస్తోంది.