చంద్రుడిపై ఉపరితలంపై అన్వేషణ కొనసాగిస్తోన్న ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్‌ను తొలిసారిగా ఫోటోలు తీసింది. విక్రమ్ ల్యాండర్‌ను నావిగేషన్ కెమెరాల సాయంతో రోవర్ తీసిన ఫోటోలను ఇస్రో తాజాగా ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేసింది.
బుధవారం ఈ చిత్రాలను ఇస్రో ట్విటర్లో పోస్ట్ చేసింది. అయితే ఇప్పటివరకు అన్ని ఫొటోలను, వీడియోలను విక్రమ్ తీయగా, రోవర్ విక్రమ్ చిత్రాన్ని తీసిందని తెలిపింది. ప్రజ్ఞాన్ రోవర్లో అమర్చిన నావిగేషన్ కెమెరాలను (నావ్‌కేమ్) బెంగళూరులోని ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది.
జాబిల్లి దక్షిణ ధ్రువం గురించి ప్రజ్ఞాన్ రోవర్ అనేక కొత్త కొత్త విషయాలను తెలియజేస్తుంది. చంద్రుడిపై ఆక్సిజన్, సిలికాన్ వంటి మూలకాలు ఉన్నట్టు గుర్తించింది. హైడ్రోజన్ కోసం రోవర్ పరిశోధనలు సాగుతున్నట్టు వివరించింది. గతవారం చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతంగా దిగి.. చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగానూ.. ఇప్పటి వరకూ ఎవరూ వెళ్లని దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగానూ భారత్ నిలిచింది.
‘ప్రస్తుతం చంద్రుడిపై అన్వేషణలు కొనసాగుతున్నాయి. రోవర్‌లోని లిబ్స్ దక్షిణ ధ్రువానికి సమీపంలో చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ (ఎస్) ఉనికిని స్పష్టంగా గుర్తించింది.. ఊహించినట్టుగానే అల్యూమినియం, కాల్షి యం, ఫెర్రస్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్, ఆక్సిజన్లను కూడా గుర్తించింది. హైడ్రోజన్ (హెచ్)కోసం అన్వేషణ కొనసాగుతోంది’ అని ట్వీట్ చేసింది.