బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సమక్షంలో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు తనయుడు వికాస్‌రావు, ఆయన భార్య దీపా బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలని, ఆ మార్పు కోసమే వికాస్ లాంటి వారు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఇంకా అనేక మంది బీజేపీలో చేరాల్సిన అవసరం ఉందని తెలిపారు.
డాక్టర్ వికాస్ రావు పార్టీలో చేరడం సంతోషకరమని బీజేపీ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. ఆయన పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలందించారని చెబుతూ దేశం కోసం, ధర్మం కోసం పని చేశారంటూ కొనియాడారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ వికాస్ రావు బీజేపీలో చేరడాన్ని స్వాగతించారు. టికెట్ వస్తుందని, గెలుస్తారని భరోసా వ్యక్తం చేశారు. బిజెపి ఎంపీ, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ కూడా వికాస్ రావును పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు తనయుడు డాక్టర్ వికాస్ మాట్లాడుతూ.. ఈరోజు తన జీవితంలో మర్చిపోలేని రోజు అని చెప్పారు. బీజేపీలో చేరడం భావోద్వేగమైన సంఘటన అని తెలిపారు. కాగా, వికాస్ రావు వేములవాడ టిక్కెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర తగ్గింపుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పెట్రోలియం ఉత్పత్తులు, వంట గ్యాస్‌పై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు, మంత్రులకు లేదన్నారు. తెలంగాణలోనే పెట్రోల్ ధర అధికంగా ఉందని.. చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఛార్జీలు, భూముల రిజిస్ట్రేషన్, హౌస్ టాక్సులు పెంచి ప్రజలపై భారం మోపారనడి మండిపడ్డారు.