ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనలకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు.
సెప్టెంబర్ 2న లండన్లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై బుధవారం వాదనలు ముగించిన న్యాయస్థానం సీఎం విదేశీ పర్యటనకు అనుమతిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది.
సెప్టెంబర్ 2 నుంచి 12 రోజులు లండన్ వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. మరోవైపు యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబారు, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేయగా, ఆయనకు కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమతించింది.
కాగా, వారిద్దరి పిటిషన్లపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరువురి తరఫున దాఖలైన పిటిషన్లపై బుధవారం వాదనలు ముగిశాయి. జగన్, సాయిరెడ్డి విదేశీ పర్యటనలకు సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలకు కోర్టు అనుమతించకూడదని, ఇరువురు సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని కోర్టుకు వివరించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది. జగన్ దాఖలు చేసిన పిటిషన్పై కౌంటరు దాఖలు చేసేందుకు గత విచారణలో సీబీఐ సమయం కోరింది. దీంతో జగన్ పిటిషన్పై విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఈ కేసులో బుధవారం వాదనలు వినిపించిన సీబీఐ.. జగన్ విదేశీ పర్యటకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది.