పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి సెప్టెంబరు 22 వ తేదీ వరకు స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. మొత్తం ఐదు రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు జరగనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
అయితే ఈ అమృత్ కాలంలో నిర్వహించే పార్లమెంట్ సమావేశాల్లో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఎదురు చూస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే ఈ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం ఎందుకు పిలుపునిచ్చిందనే విషయాన్ని మాత్రం మంత్రి వెల్లడించలేదు.ఈ ప్రత్యేక సమావేశాల్లో 10 కి పైగా కీలక బిల్లులను ప్రవేశపెట్టి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ పార్లమెంటు సమావేశాలు 17వ లోకసభలో 13 సెషన్ కాగా రాజ్యసభలో 261వ ఎడిషన్ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. అయితే అనుకోకుండా ఒక్కసారిగా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం పిలుపునివ్వడంతో రాజకీయ వర్గాలతోపాటు విశ్లేషకుల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎవరూ ఊహించని విధంగా ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించటం రాబోయే రాజకీయంగా కలకలం రేపుతోంది. ఉన్నట్టుండి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏముంది? ఈ సమావేశాల్లో ఏయే అంశాలపై చర్చించనున్నారు? అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌కు ముందుస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలె పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. జులై 20 వ తేదీన ప్రారంభమైన ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఆగస్ట్ 11వ తేదీ వరకు జరిగాయి.
అయితే మణిపూర్‌లో చెలరేగిన హింస కారణంగా అదే అంశంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి.
దీనికి తోడు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడి వేడి చర్చ జరిగింది. మొత్తం 23 రోజుల పాటు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో.. మొత్తం 23 బిల్లులకు లోక్ సభ, రాజ్యసభలు ఆమోదం తెలిపాయి.