ముంబైలో గురువారం ప్రతిపక్షాల కూటమి ఇండియా రెండురోజుల భేటీ ఆరంభం అయింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష కూటమిని బలోపేతం చేసే దిశలో ఏర్పాటు అయిన మూడో భేటీ ఇది. సెప్టెంబరు 30కల్లా సీట్ల సర్దుబాటుపై తుదినిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి వచ్చారు.
గురువారం ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో వారంతా ఇష్టాగోష్ఠిగా సమావేశమై.. శుక్రవారం జరగబోయే సమావేశానికి ఎజెండా ఖరారు చేశారు. కూటమికి కన్వీనర్ ఉండాలా వద్దా? సీట్ షేరింగ్‌పై సబ్‌గ్రూపులను ఏర్పాటు చేయాలా? అనే అంశాలతోపాటు విపక్షాలన్నీ కలిసి ఉమ్మడిగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాల గురించి, కనీస ఉమ్మడి కార్యక్రమ రూపకల్పనపైన శుక్రవారం భేటీలో చర్చించనున్నారు.
28 పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు గురువారంనాటి భేటీకి హాజరుకాగా వారిలో పలువురు నేతలు ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో సీట్ల సర్దుబాటును వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు సమాచారం. తుది నిర్ణయం ఆధారంగా అన్ని పార్టీల రాష్ట్ర కమిటీలూ సీట్ల సర్దుబాటు ఫార్ములాను అమలు చేయనున్నాయి.
అలాగే శుక్రవారం భేటీ అనంతరం.. కూటమిలోని ప్రధాన పార్టీలకు చెందిన 11 మంది నేతలతో కో-ఆర్డినేషన్ కమిటీని ప్రకటించడంతోపాటు కూటమి లోగోను ఆవిష్కరించే అవకాశం ఉంది. కాగా..ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకే తామందరం చేతులు కలిపామని.. అధికార బీజేపీని గద్దె దించేందుకు అవసరమైన ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిస్తామని ఈ సమావేశంలో పాల్గొన్న విపక్షాల నాయకులు పేర్కొన్నారు. ఇండియా కూటమి భేటీ శుక్రవారం కూడా కొనసాగనుంది.
ఇండియా భేటీకి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, ఉద్ధవ్ థాకరే , సీనియర్ నేత శరద్ పవార్ వంటి వారు వచ్చారు. ఆదిత్యా థాకరే, సంజయ్ రౌత్, ఆర్జేడీ నేత మనోజ్ ఝాతో భేటీకి ముందు రాహుల్ మాట్లాడుతూ కన్పించారు.
గురువారం సాయంత్రం తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్, జార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ , బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్ తరలివచ్చారు. ఇండియా భేటీలో పాల్గొనేందుకు మమత బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా, పిడిపి నేత మెహబూబా ముఫ్తీ బుధవారమే వచ్చారు.
ఇండియా కూటమిలో ఇన్నాళ్లుగా 26 పార్టీలు ఉండగా.. గురువారంనాటి భేటీకి మరో రెండు పార్టీలు కొత్తగా హాజరయ్యాయి. వాటిలో ఒకటి ‘పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా (పీడబ్ల్యూపీ)’ కాగా.. మరొకటి మహారాష్ట్రలోని మార్క్సిస్ట్ పొలిటికల్ పార్టీ. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ‘అసోం జాతీయ పరిషత్’, ‘రైజోర్ దళ్’, ‘ఆంచలిక్ గణ్ మంచ్ భుయాన్’ కూడా ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నాయి.