కర్ణాటకకు చెందిన జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ ఎంపీ ఎన్నిక చెల్లదని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటంతో పాటు ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించని ఆయనను అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం(ఈసీ)ని ఆదేశించింది.
కాగా, 2019 లోక్సభ ఎన్నికల్లో జేడీ(ఎస్) నుంచి ఏకైక ఎంపీగా ప్రజ్వల్ గెలిచారు. అయితే ఆయన ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని, ఎన్నికల సంఘానికి తన ఆస్తులను ప్రకటించలేదని ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఏ మంజు, ఆ నియోజకవర్గం ఓటరు జీ దేవరాజే గౌడ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి కే నటరాజన్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఎంపీగా ప్రజ్వల్ ఎన్నిక చెల్లదన్నారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడిన ఆయనను అనర్హుడిగా ప్రకటించారు. మరోవైపు, నాడు ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఏ మంజు కూడా ఎన్నికల అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో గెలిచిన అభ్యర్థిగా ప్రకటించాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను తిరస్కరించింది.
అలాగే ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన ప్రజ్వల్ తండ్రి, ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్ సోదరుడు, ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణతోపాటు మంజుపై కూడా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు బీజేపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయిన మంజు ఆ తర్వాత జేడీ(ఎస్)లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు.