రానున్న లోక్ సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కలిసే పోటీ చేస్తామని ముంబైలో రెండు రోజుల పాటు జరిపిన సమావేశంలో విపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు ఒక తీర్మానం చేశారు. ఆయా రాష్ట్రాల్లో సీట్ల షేరింగ్ కు సంబంధించి చర్చలు వెంటనే ప్రారంభించాలని, సీట్ల పంపకం విషయంలో పట్టువిడుపులతో, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని నిర్ణయించారు.
జమిలి ఎన్నికలకు సంబంధించి బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందన్న వార్తల నేపథ్యంలో విపక్ష కూటమి వేగం పెంచింది. ఈ సమావేశాల్లోనే 13 మంది సభ్యులతో ఒక సమన్వయ కమిటీని కూడా విపక్ష కూటమి ఏర్పాటు చేసింది. సమన్వయ కమిటీతో పాటు 20 మంది సభ్యులతో ప్రచార కమిటీని, 12 మంది సభ్యులతో సోషల్ మీడియా వర్కింగ్ గ్రూప్ ను, 11 మంది సభ్యులతో రీసెర్చ్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు.
సమన్వయ కమిటీలో కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), శరద్ పవార్ (ఎన్సీపీ), టీఆర్ బాలు (డీఎంకే), హేమంత్ సోరెన్ (జేఎంఎం), సంజయ్ రౌత్ (ఎస్ఎస్-యూబీటీ), తేజస్వి యాదవ్ (ఆర్జేడీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ), రాఘవ్ చద్దా (ఆప్), జావేద్ అలీ ఖాన్ (ఎస్పీ), లలన్ సింగ్ (జేడీయూ), డీ. రాజా (సీపీఐ), ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), సీపీఎం నుంచి మరో సభ్యుడు ఉంటారని రౌత్ తెలిపారు.
ముంబైలో జరిగిన సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీయేతర 28 రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలకు, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్ని కేంద్రం ఆలోచనను విపక్ష కూటమి తీవ్రంగా ఖండించింది. అలాగే, చంద్రయాన్ 3 విజయాన్ని స్వాగతిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్రంలోని ఎన్డీయే నిరంకుశ సర్కార్ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని కాంగ్రస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. ముంబైలో జరిగిన విపక్ష కూటమి ఇండియా భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసిన ఖర్గే ఇండియా సమైక్యంగా నిలిచింది..ఇండియా విజేతగా నిలుస్తుందని క్యాప్షన్ ఇచ్చారు. పురోగామి, సంక్షేమ, సమ్మిళిత ఇండియా కోసం తాము కలిసికట్టుగా నిలిచామని ఖర్గే రాసుకొచ్చారు. దేశంలో మార్పు అవసరమని 140 కోట్ల భారతీయులు నిర్ణయించుకున్నారని చెప్పారు.
పక్ష పార్టీలు ఏకమైతే బీజేపీ గెలుపు అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశ జనాభాలో 60 శాతం జనాభాకు విపక్ష కూటమి పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తాయని పేర్కొన్నారు. ఈ దశలో ఇండియా కూటమి దేశ జనాభాలో 60 శాతం జనాభాకు ప్రాతినిధ్యవ వహిస్తోందని, రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ఏకమైతే బీజేపీకి గెలుపు అసాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. సమర్ధవంతంగా విపక్షాల కలయిక జరగాలని రాహుల్ పిలుపిచ్చారు.
ఈ సమావేశాల్లో కాంగ్రెస్ నుంచి పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, నితీశ్ కుమార్ (జేడీయూ), శరద్ పవార్ (ఎన్సీపీ), మమత బెనర్జీ (టీఎంసీ), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), ఫారూఖ్ అబ్దుల్లా (ఎన్సీ), మొహబూబా ముఫ్తీ (పిడీపీ), వామపక్షాలు, ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు.