షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సరిగ్గా 11.50 గంటలకి పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ప్రయోగం జరిగింది. నిప్పులు చెరుగుతూ నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ దూసుకెళ్లింది. 63 నిమిషాల పాటు 235 కి.మీ దూరం నింగిలోకి ప్రయాణించిన అనంతరం భూస్థిర కక్ష్యలోకి ఆదిత్యా ఎల్-1 శాటిలైట్‌ని పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ప్రవేశపెట్టనుంది.
మిషన్ ఆదిత్య ప్రయోగానికి సుమారు రూ.378 కోట్లు ఇస్రో వెచ్చించింది. షార్‌లో తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. మిషన్ ఆదిత్య విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు గట్టి ధీమాతో ఉన్నారు. పీఎస్ఎల్వీ సీ-57 సైతం దిగ్విజయంగా నింగిలోకి దూసుకువెళుతోంది. చంద్రయాన్-3 విజయవంతంతో దూకుడుమీదున్న ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపట్టింది.
ఇది నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా చేరుకున్నట్లు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమ్‌నాథ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే అమెరికా, జపాన్, యూరప్, చైనా దేశాల తర్వాత సూర్యుడిపైకి ఉపగ్రహాన్ని పంపిన ఐదో దేశంగా భారత్ నిలిచింది.
దీనిలో భాగంగా నేడు పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్‌ను ప్రయోగించింది. ఆదిత్య ఎల్-1 శాటిలైట్‌ను ఇస్రో లాగ్రాంజియన్ పాయింట్ -1లో కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నది. ఈ కక్ష్య భూమికి 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ కక్ష్యను చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పట్టనుంది.
సూర్యుడిపై ప్రయోగాల నేపథ్యంలో ఇస్రో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. గతంలో కొన్ని దేశాలు సూర్యుడిపై ప్రయోగాలు చేపట్టాయి. అయితే ఆదిత్య ఎల్-1 మిషన్‌తో ఇస్రో ఎలాంటి పరిశోధనలు చేయనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇది సూర్యుడిపైకి ఇస్రో పంపించే తొలి ప్రయోగం కావడం విశేషం. దీంతో పాటు భూమి నుంచి చాలా దూరంలోకి కూడా ఇస్రో పంపించిన ప్రయోగంగా ఆదిత్య ఎల్ 1 రికార్డులలోకి ఎక్కింది.
కాగా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపించిన ప్రోబ్ అనే రాకెట్ ప్రస్తుతం కరోనా పొరలోకి ప్రవేశించి పరిశోధనలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఇస్రో పంపించిన ఆదిత్య ఎల్ 1 కూడా సూర్యుడి పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. అయితే ఈ ఆదిత్య ఎల్ 1 ప్రయోగం లాగ్రాంజ్ 1 పాయింట్ వద్దకు చేరుకుని పరిశోధనలు జరపనుంది.
అంతరిక్షంలో లాగ్రాంజ్ పాయింట్ అనేది ఒక పార్కింగ్ ఏరియా లాంటిది. ఆదిత్య ఎల్ 1.. ఈ లాగ్రాంజ్ 1 పాయింట్ వద్దకు చేరుకున్న తర్వాత సూర్యుడి దగ్గర జరిగే పరిణామాలను అధ్యయనం చేసిన ఇస్రోకు అందించనుంది. అయితే సూర్యుడి చుట్టూ ఐదు లాగ్రాంజ్ పాయింట్లు ఉన్నాయి. అందులో లాగ్రాంజ్ పాయింట్ 1 వద్దకు ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని ఇస్రో పంపించింది.
ఈ లాగ్రాంజ్ పాయింట్ 1 నుంచి ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం.. సూర్యుడిని నిరంతరం పరిశీలిస్తుంది. అక్కడి నుంచి ఇతర గ్రహాలు, అక్కడి పర్యావరణ పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. ఆ లాగ్రాంజ్ పాయింట్ 1 భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం 125 రోజుల పాటు ప్రయాణించి చేరుకోనుంది.