చంద్రయాన్-3 దిగిన చంద్రుడి దక్షిణ ధృవంపై లూనార్ నైట్ ప్రారంభం కానున్నది. భూ కాలమానం ప్రకారం ఇది 14 రోజులు కొనసాగుతుంది. ఈ సమయంలో చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉష్టోగ్రతలు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి.
అలాగే లూనార్ నైట్ సమయంలో అక్కడ సూర్య కాంతి ఉండదు. దీంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పని చేసేందుకు విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానల్స్ పని చేయవు. ఈ నేపథ్యంలో ల్యాండర్, రోవర్‌ను స్లీప్ మోడ్‌లో ఉంచేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధమవుతున్నది.
కాగా, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సన్ మిషన్ ఆదిత్య ఎల్1ను ఇస్రో శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ఈ సందర్భంగా మూన్ మిషన్ చంద్రయాన్ -3 గురించి కూడా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ ఇప్పటికీ పని చేస్తున్నాయని తెలిపారు.
అయితే చంద్రుని రాత్రిని తట్టుకునేందుకు ఈ రెండింటినీ స్లీప్ మోడ్‌లో ఉంచే ప్రక్రియను ఒకటి రెండు రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. ‘‘రోవర్, ల్యాండర్లను నిద్రపుచ్చే ప్రక్రియ ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రారంభమవుతుంది. చంద్రునిపై రాత్రివేళ సమీపిస్తోంది. అక్కడ ఈ రెండు రాత్రిని తట్టుకోవలసి ఉంటుంది కాబట్టి, వాటిని స్లీప్ మోడ్‌లోకి పంపుతున్నాం’’ అని తెలిపారు.
అలాగే రోవర్ ఇప్పటి వరకు చంద్రుడి ఉపరితలంపై సుమారు 100 మీటర్ల దూరం ప్రయాణించిందని వెల్లడించారు.‘‘ప్రజ్ఞాన్ రోవర్ 100 నాటౌట్. చంద్రుని ఈ రోవర్ ఇప్పటివరకు 100 మీటర్లు ప్రయాణించింది, ఇంకా ప్రయాణం కొనసాగిస్తోంది’’ అంటూ ఇస్రో ట్వీట్ చేసింది.
చంద్రుడి దక్షిణ ధృవంపై ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణించిన మార్గం చిత్రాన్ని ఇస్రో షేర్ చేసింది. అయితే చంద్రుడి దక్షిణ ధృవంపై తిరిగి లూనార్ డే మొదలైన తర్వాత అక్కడ ఉన్న ల్యాండర్, రోవర్ ఏ మేరకు తిరిగి పనిచేస్తాయి అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
దక్షిణ ధ్రువంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది. చంద్రునిపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు ల్యాండ్ అయిన వెంటనే తమ పనిని మొదలుపెట్టాయి. ఇప్పటిదాకా అవి అక్కడ చంద్రుని ఉష్ణోగ్రత వివరాల్ని భూమికి పంపించాయి. అంతేకాదు.. సల్ఫర్, ఆక్సిజన్, ఇనుము, క్రోమియం, సిలికాన్ వంటి మూలకాల ఉనికిని సైతం చంద్రయాన్-3 కనుగొంది. ప్రస్తుతం హైడ్రోజన్, హీలియం నిల్వల వేట సాగుతోంది.