మన దేశం జీ20 ప్రెసిడెన్సీని చేపట్టడంతో అనేక సకారాత్మక ప్రభావాలు కనిపిస్తున్నాయని, వీటిలో కొన్ని తన మనసుకు చాలా దగ్గరయ్యాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆలోచనల వేదిక స్థాయి నుంచి భవిష్యత్తుకు మార్గసూచిగా భారత్ నాయకత్వంలో జీ20 మారిందని తెలిపారు.
ప్రపంచపు ఎజెండాకు రూపమివ్వడానికి భారత దేశానికి జీ20 ప్రెసిడెన్సీ రావడం అద్భుతమైన అవకాశమని ప్రధాని చెప్పారు. మానవుడే కేంద్రంగా ఉండే ప్రపంచంవైపు మరింతగా పరివర్తన చెందాలనే అంశంపై తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) కేంద్రంగా చూడటం ప్రపంచంలో సంప్రదాయంగా వస్తోందని, ఈ దృక్పథం ఇప్పుడు మరింత సమ్మిళితత్వంతో, మానవుడే కేంద్రంగా ఉండే వైఖరికి మారుతోందని చెప్పారు. ఈ పరిణామ క్రమంలో భారత దేశం ఉత్ప్రేరకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు
భారత దేశం ఏ విధంగా పరివర్తన చెందుతోందో మోదీ వివరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో కూడా ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి’ సిద్ధాంతానికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. ఈ సిద్ధాంతం ప్రపంచ సంక్షేమానికి దిక్సూచిగా మార్గదర్శనం చేస్తుందని తెలిపారు.
2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
భారత దేశ అభివృద్ధి గురించి మోదీ మాట్లాడుతూ, 2047నాటికి భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని చెప్పారు. మన జాతీయ జీవనంలో అవినీతి, కులతత్వం, మతతత్వాలకు చోటు లేదని స్పష్టం చేశారు. (భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 2047నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ పాతికేళ్ల కాలాన్నే అమృతకాలం అంటున్నారు).
చాలా కాలం వరకు భారత దేశం అంటే 100 కోట్ల ఆకలి కడుపులు అని అనేవారని, ఇప్పుడు అది ఆకాంక్షలతో కూడిన వంద కోట్ల మందిగల దేశంగా, 200 కోట్ల నైపుణ్యంగల చేతులు ఉన్న దేశంగా మారిందని చెప్పారు. నేడు భారతీయుల ముందు అద్భుతమైన అవకాశం ఉందని చెబుతూ రాబోయే వెయ్యేళ్లపాటు గుర్తుంచుకునే విధంగా అభివృద్ధికి పునాది వేయడానికి భారతీయులకు గొప్ప అవకాశం వచ్చిందని తెలిపారు.
ప్రపంచంలో మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత దేశం త్వరలోనే అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఓ దశాబ్దం కన్నా తక్కువ సమయంలోనే మన దేశం ఐదు స్థానాలు ఎగబాకిందని చెప్పారు. భారత దేశ ఆర్థిక ప్రగతి నిరాకరించజాలనిదని తెలిపారు.
జీ20 సదస్సు నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రుల స్థాయి సమావేశాలను నిర్వహించడంపై పాకిస్థాన్, చైనా అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై మోదీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సమావేశాలను నిర్వహించుకోవడం సహజమేనని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, కశ్మీరులలో జీ20 మంత్రుల స్థాయి సమావేశాలను నిర్వహించడంపై పాకిస్థాన్, చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల్లోని వేర్వేరు ఘర్షణలను పరిష్కరించుకోవడానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గాలని తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టడానికి అంతర్జాతీయ సహకారం తప్పనిసరి అని చెప్పారు. సైబర్ నేరాల వల్ల ఎదురయ్యే ముప్పును ప్రపంచ దేశాలు తీవ్రంగా పరిగణించాలని చెప్పారు.
ఉగ్రవాదులు తమ దుర్మార్గపు లక్ష్యాలను సాధించుకోవడం కోసం డార్క్నెట్, మెటావెర్స్, క్రిప్టోకరెన్సీ వంటివాటిని ఉపయోగించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి వల్ల దేశాల సామాజిక కలనేతపై పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు. బూటకపు వార్తల వల్ల న్యూస్ సోర్స్ విశ్వసనీయత పోతుందని, సమాజంలో అశాంతి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.