గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ను గెజిట్లో ప్రచురించాల్సిందిగా ఆదేశిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల ప్రధానాధికారికి లేఖలు రాసింది.
హైకోర్టు తీర్పు ప్రకారం 2018 డిసెంబర్ 12 నుంచి డీకే అరుణను ఎమ్మెల్యేగా పరిగణించాలని కూడా ఆ లేఖలో పేర్కొంది. లేఖతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన 56 పేజీల తీర్పు కాపీని ఈసీ జతచేసింది.
గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే అరుణపై గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు పొందుపరిచారని, అందులోనూ ఆస్తుల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినందున అదంతా అవినీతిగా పరిగణలోకి తీసుకుని అనర్హుడిగా ప్రకటించాలని పేర్కొంటూ డీకే అరుణ్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో వాదనల సమయంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణకు, వాయిదాలకు హాజరుకాకపోవడంతో ఎక్స్-పార్టీ తీర్పునిచ్చింది. హైకోర్టు డీకే అరుణ తరఫున కేసు వాదించి గెలిపించిన ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ సోమవారం ఢిల్లీలో సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కేవియట్ ద్వారా తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్, తదుపరి ఉత్తర్వులపై మాట్లాడుతూ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన కేసులో హైకోర్టు తీర్పు ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు.
హైకోర్టు తీర్పు ప్రకారం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసే అధికారం అసెంబ్లీ స్పీకర్ లేదా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుందని, ఇప్పుడు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి తదుపరి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించి ఎమ్మెల్యేగా అందజేయాల్సిన సదుపాయాలన్నీ ఆమె ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు.
కాగా, ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి డీకే అరుణ కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసినందున ఆమె ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పరిగణ పొందుతారు. అయితే ఆమె ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నందున ప్రమాణ స్వీకారం అనంతరం తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.