మణిపూర్లో హింసపై తప్పుడు, స్పా్న్సర్డ్ రిపోర్టు ఇచ్చారంటూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సభ్యులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెరిగేందుకు ఈజీఐ ప్రయత్నించిందని ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఆరోపించారు. గిల్డ్ మెంబర్లపై తమ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని తెలిపారు.
రాష్ట్రంలో మరిన్ని ఘర్షణలకు ఈజీఐ ప్రయత్నించిందని మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆరోపించారు. ఈజీఐ సభ్యులను సీఎం హెచ్చరిస్తూ…”ఎడిటర్ గిల్డ్ సభ్యులను హెచ్చరిస్తున్నాను. ఏదైనా మీరు చేయదలిస్తే ఘటనా స్థలికి వెళ్లండి. వాస్తవ పరిస్థితిని స్వయంగా చూడండి. అన్ని వర్గాల ప్రతినిధులను కలుసుకోండి” అంటూ హితవు చెప్పారు.
“అప్పుడు మీరు తెలుసుకున్నదేదో దానిని ప్రచురించండి. అలాకాకుండా, కొన్ని వర్గాలను మాత్రమే కలుసుకుని, మీ అంతగామీరే ఒక నిశ్చితాభిప్రాయానికి వస్తే అది పూర్తిగా గర్హనీయం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఈజీఐ సభ్యులను టార్గెట్ చేస్తూ ఇంఫాల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. గిల్డ్ అధ్యక్షుడు సీమ గుహ, సంజయ్ కపూర్, భరత్ భూషణ్ సహా పలువురిపై ఈ ఫిర్యాదు నమోదైంది. మణిపూర్లో జాతుల మధ్య హింసాకాండకు సంబంధించిన నిజ నిర్దారణ మిషన్ రిపోర్ట్ అనే శీర్షికతో సెప్టెంబర్ 2న ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తమని, అభూతకల్పన అని, స్పాన్సర్డ్ కథనమని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.