ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో సంచలనం సృష్టించబోతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, డిజిటల్ ఇండియా, చంద్రయాన్-3 వంటివాటి సరసన దేశం పేరు మార్పు కూడా జత కలవబోతున్నట్లు తెలుస్తోంది. మన దేశం పేరును ‘ఇండియా’కు బదులుగా ‘భారత్’ అని మార్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
తాజాగా రాష్ట్రపతి భవన్ జీ20 దేశాధినేతలకు పంపిన ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొంది. దానితో ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు, దేశం పేరును మార్చే బిల్లు వస్తాయని ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 దేశాధినేతల సమావేశాలు జరుగుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 9న రాత్రి ఈ దేశాధినేతల గౌరవార్థం విందు ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొంది.
అదే విధంగా విదేశీ ప్రతినిధులకు మన దేశ అధికారులు ఓ పుస్తకాన్ని అందజేశారు. ఈ పుస్తకం శీర్షిక ‘‘భారత్, ది మదర్ ఆఫ్ డెమొక్రసీ’’ (భారత్, ప్రజాస్వామ్యం యొక్క తల్లి). మన దేశం వేలాది సంవత్సరాల నుంచి ప్రజాస్వామిక విలువలతో మనుగడ సాగిస్తోందని తెలిపేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ పుస్తకం ప్రారంభంలో, ‘‘భారత్లో, అంటే ఇండియాలో, రికార్డయిన ప్రాచీన చరిత్ర నుంచి పాలనలో ప్రజల సమ్మతిని తీసుకోవడం జీవనంలో ఓ భాగం’’ అని రాశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ మార్పు పట్ల హర్షం ప్రకటిస్తూ ఇచ్చిన ట్వీట్లో, ‘‘గణతంత్ర భారత్ – అమృత కాలం దిశగా మన నాగరికత సగర్వంగా దూసుకెళ్తున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉంది’’ అని తెలిపారు.
ఈ మార్పును బీజేపీ నేతలు స్వాగతిస్తుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేశ్ మంగళవారం ఇచ్చిన ట్వీట్లో, ‘‘అయితే ఈ వార్త నిజమే. సెప్టెంబరు 9న జరిగే జీ20 విందు కోసం ఆహ్వాన పత్రాలను రాష్ట్రపతి భవన్ పంపించింది. దీనిలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని పేర్కొనడానికి బదులుగా, ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాశారు. ఇప్పుడు రాజ్యాంగంలోని అధికరణ 1 ఈ విధంగా ఉంటుంది : ‘భారత్, అంటే ఒకప్పటి ఇండియా, రాష్ట్రాల యూనియన్.’ కానీ ఇప్పుడు ఈ ‘రాష్ట్రాల యూనియన్’ దాడికి గురవుతోంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ, దేశ గౌరవానికి, గర్వకారణంగా నిలిచేవాటికి సంబంధించిన ప్రతి అంశంపైనా కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ప్రశ్నించారు. ‘భారత్ జోడో’ అంటూ రాజకీయ యాత్రలు చేయడమెందుకు? ‘భారత్ మాతా కీ జై’ నినాదాన్ని ద్వేషించడం ఎందుకు? అని నిలదీశారు.
దేశం పట్ల, రాజ్యాంగం, రాజ్యాంగ వ్యవస్థల పట్ల కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదని స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. ఆయన (జైరామ్ రమేశ్) ఓ కుటుంబం ముఖస్తుతి కోసమే మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ జాతి వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఉద్దేశాల గురించి యావత్తు దేశానికి తెలుసునని చెప్పారు.
ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ కొద్దీ రోజుల క్రితం అస్సాంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘ఇండియా’ అనే పదాన్ని వాడటం మానేయాలని, ‘భారత్’ అని పిలవాలని కోరారు. భారత్ పేరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత్యే అవుతుందని స్పష్టం చేశారు. రాసేటపుడు, మాట్లాడేటపుడు భారత్ అనే పిలవాలని కోరారు.