రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాల్లో ఓటరుగా నమోదైనట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతపై ఆరోపణలు రావడంతో ఢిల్లీ తీస్ హజారీ కోర్టు సమన్లు జారీ చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ కు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సమన్లు జారీ చేసింది. రెండు నియోజకవర్గాల్లో ఓటు నమోదు చేసుకున్నారనే కేసును విచారించిన కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని చాందిని చౌక్ అసెంబ్లీ నియోజకవర్గం, ఉత్తరప్రదేశ్ లోని షాహిబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమెకు ఓట్లు ఉన్నాయంటూ ప్రజా ప్రాతినిథ్య చట్టం కింద కేసు నమోదయింది.
ఈ నేపథ్యంలో తమ ముందు నవంబర్ 18న హాజరు కావాలని ఆదేశిస్తూ హైకోర్టు సమన్లు జారీ చేసింది. సునీత కేజ్రీవాల్ పై బిజెపి ఢిల్లీ కార్యదర్శి హరీశ్ ఖురానా ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది. అంతేకాదు ఆమెకు రెండు చోట్ల ఓట్లు ఉన్న డాక్కుమెంట్లను ఆయన కోర్టుకు అందించారు.
ఫిర్యాదుదారు, ఇతర సాక్షుల వాంగ్మూలాన్ని పరిగణన లోకి తీసుకున్న తరువాత సునీత కేజ్రీవాల్‌పై ప్రాథమికంగా కేసు నమోదు చేసినట్టు న్యాయస్థానం భావిస్తోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 లోని సెక్షన్ 31 ప్రకారం శిక్షార్హమైన నేరాలు చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అందువల్ల సమన్లు జారీ చేస్తున్నామని అందులో పేర్కొన్నారు.
సమన్ల జారీకి ముందు సాక్షాధారాలు, వాంగ్మూలాలు పరిగణన లోకి తీసుకున్నట్టు కోర్టు పేర్కొంది. తీస్‌హజారీ కోర్టు నవంబర్ 18న ఈ కేసు విచారణ చేపట్టనుంది.