సౌకర్యాలు, సంతోషాల కోసం ప్రకృతిని, పర్యావరణాన్ని ఇష్టారీతిన వాడుకుంటూ మనిషి తన గొయ్యిని తనే తవ్వుకుంటున్నాడు. అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత, పర్యావరణాన్ని పాడుచేసే ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాల పారబోత, వాహనాలు, పరిశ్రమలు వదిలే కలుషిత పదార్థాల తీవ్రత వెరసి భూమిపై వాతావరణ మార్పులు చాలా వేగంగా చోటుచేసుకుంటున్నాయి.
ఇదిలాగే కొనసాగితే భూతాపం అధికమై రానురాను భూమిపై జీవి మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు గడిచిన మూడు నెలల కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఎప్పుడూ లేనంతంగా భూమి వేడెక్కడంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోయారు.
గడిచిన త్రైమాసికంలో (జూలై, ఆగస్టు, సెప్టెంబర్) భూమిపై గతంలో ఎన్నడూ లేనంత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ‘కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ (సి3ఎస్)’ వెల్లడించింది. భూమిపై సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు భారీగా పెరగడమే భూతాపం అధికం కావడానికి కారణమని తెలిపింది.
ఇదిలావుంటే, గడిచిన ఏడాది కాలంగా అంటార్కిటికా సముద్రంలో మంచు విస్తృతి కూడా రికార్డు స్థాయికి తగ్గిపోయిందని సి3ఎస్ పేర్కొంది. ఈ వేడి త్రైమాసికంలో ఆగష్టు నెల అత్యధిక వేడితో తొలి స్థానంలో ఉండగా, జూలై నెల ఆ తర్వాత స్థానంలో ఉన్నది.