సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి డా. సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడు గవర్నర్ ఆర్ ఆర్ రవికి లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ద్వారా వెల్లడించారు.
ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకును ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరుతూ తాను గవర్నర్‌కు లేఖ పంపించానని తెలిపారు. ఉదయనిధి స్టాలిన్ మరోసారి కనుక సనాతన ధర్మంపై ఇష్టారీతిన మాట్లాడితే తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేయించేందుకు కూడా వెనుకాడేది లేదని, అందుకోసమే పని చేస్తానని హెచ్చరించారు.
భారత్ సమాఖ్య కాదని, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని తాను 1991లో నిరూపించినట్లు డా. స్వామి గుర్తు చేశారు. సనాతన ధర్మంపై ఇష్టారీతిన మాట్లాడిన వ్యక్తి మంత్రి అని, ఓ పబ్లిక్ ఫిగర్ అని డా. స్వామి గుర్తు చేశారు. ఆయన చేసే వ్యాఖ్యలు ఎక్కువమందికి చేరుకుంటాయని తెలిపారు.
అందుకనే ఆ వ్యాఖ్యలు సనాతన ధర్మ సమాజంలో ఆందోళనలు కలిగించాయని పేర్కొన్నారు. ఉదయనిధి పార్టీ డీఎంకే తమిళనాడులో అధికారంలో ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అశాంతిని రేపేలా ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని, ఆయనపై తక్షణమే ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని డా. స్వామి డిమాండ్ చేశారు.