ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్ లో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్‌గా మారారు. ఈ కేసులో ఇప్పటికే ఎంపీ మాగుంట కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవ ఇప్పటికే అప్రూవర్‌గా మారిపోగా ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి కూడా అప్రూవర్‌గా మారిపోయారు.
తాజాగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్ మారడంతో ఆయన నుంచి ఈడీ కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వారిలో సౌత్ గ్రూపునకు చెందిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. అప్రూవర్ గా మారిన మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రా రెడ్డికి బెయిల్ లభించింది.
ఈ కేసుకు సంబంధించి కీలక పాత్ర పోషించిన సౌత్ గ్రూప్‌లో మాగుంట తండ్రీ కొడుకులు కీలకంగా వ్యవహరించినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంపీ మాగుంట, ఆయన కొడుకు రాఘవ ఇద్దరూ అప్రూవర్లుగా మారడంతో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఇప్పుడు మరింత ఉత్కంఠగా మారింది.
రాఘవరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ మరికొందరిని ఈ స్కామ్ లో ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి దిల్లీకి నగదు ఎలా తరలించారో ఈడీ దృష్టి పెట్టింది. ఈ స్కామ్ లో హవాలా వ్యవహారాలు నడిపించిన 20 మందిని ఈడీ ప్రశ్నించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబును ఇటీవల ఈడీ మరోసారి ప్రశ్నించింది. ఇటీవల ఈడీ దర్యాప్తు చాలా గోప్యంగా సాగుతోంది. రానున్న రోజుల్లో మరికొంత మందిని ఈడీ ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న ఇండో స్పిరిట్ కంపెనీలో కీలక భాగస్వామ్యం మాగుంటదే కావటణ గమనార్హం.