ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20 దేశాల కూటమిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగల దేశాలు కలిసి జీ20గా 1999లో ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత ఈ కూటమిలో ఇతర దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించలేదు. జీ20 సమావేశాలు శని, ఆదివారాల్లో న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న సంగతి తెలిసిందే.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం మాట్లాడుతూ, అందరితో కలిసి (సబ్కా సాథ్) అనే భావానికి అనుగుణంగా ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత దేశం ప్రతిపాదిస్తోందని తెలిపారు. ఈ ప్రతిపాదనను అందరూ అంగీకరిస్తారని నమ్ముతున్నానని చెప్పారు.
‘‘మీ అంగీకారంతో…’’ అని చెప్తూ, జీ20లోకి ఆఫ్రికన్ యూనియన్ ప్రవేశించినట్లు తెలియజేస్తూ, ఆయన ఓ చిన్న సుత్తితో మూడుసార్లు కొట్టారు. ‘‘మనం పని ప్రారంభించే ముందు, శాశ్వత సభ్యునిగా తన స్థానాన్ని స్వీకరించవలసినదిగా ఆఫ్రికన్ యూనియన్ ప్రెసిడెంట్‌ను ఆహ్వానిస్తున్నాను’’ అని చెప్పారు.
అనంతరం విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ప్రస్తుత ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, కొమొరోస్ ప్రెసిడెంట్ అజలి అసౌమనిని సాదరంగా ఆయనకు కేటాయించిన ఆసనం వద్దకు తీసుకొచ్చారు. అసౌమనిని మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, స్వాగతం పలికారు.
ఆఫ్రికన్ యూనియన్ 2002లో ప్రారంభమైంది. దీనిని జీ20లో చేర్చుకోవడం గురించి ప్రస్తుత జీ20 దేశాల నేతల సమావేశం ముసాయిదా ప్రకటనలో చేర్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కూటమిలో యూరోపియన్ యూనియన్‌కు జీ20లో సభ్యత్వం ఉంది. 27 దేశాల యూరోపియన్ యూనియన్‌తో సమాన హోదాను ఆఫ్రికన్ యూనియన్‌కు కల్పించారు.
ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత సభ్యత్వం పొందినప్పటికీ జీ20 పేరులో మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో సంపూర్ణ సభ్యత్వం ఇవ్వాలని మోదీ జూన్‌లో ఈ కూటమిలోని దేశాలకు లేఖలు రాశారు. ఈ ప్రతిపాదనను వేర్వేరు కారణాలతో ఈయూ, చైనా, రష్యా సమర్థించాయి.
జీ20 సదస్సును ప్రారంభిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. కరోనా తర్వాత ప్రపంచంలో అపనమ్మకం పెరిగిపోయిందంటూ.. దురదృష్టవశాత్తూ యుద్ధం (రష్యా-ఉక్రెయిన్) దీన్ని మరింత తీవ్రతరం చేసిందన్నారు. నమ్మకం, విశ్వాసంతో కలసి ప్రపంచ మేలు కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు.
పాత కాలం నాటి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన సమయంలో మనమంతా ఉన్నామంటూ, మానవతా దృక్పథంతో మన బాధ్యతలను నిర్వహించాల్సి ఉందని తెలిపారు. ప్రపంచానికి 21వ శతాబ్దంలో కొత్త మార్గాన్ని చూపాల్సి ఉందని చెప్పారు. ‘‘మనమంతా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. కరోనా వంటి మహమ్మారిని ఓడించినప్పుడు ఈ విశ్వాసలేమి సవాలును కూడా మనం అధిగమించగలం’’ అని ప్రధాని పేర్కొన్నారు.
‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్’ అనే భారత నినాదాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. జీ20కి భారత్ నాయకత్వం చేరికకు చిహ్నంగా మారినట్టు పేర్కొన్నారు. ఇంటా, బయటా అందరితో కలసి అన్న దానికి సబ్ కా సాత్ ను ప్రస్తావించారు. ‘‘ఇది ప్రజల జీ20 సదస్సు. 60కు పైగా పట్టణాల్లో 200కు పైగా కార్యక్రమాలు చేపట్టాం. ప్రపంచానికి మంచి చేసేందుకు మనమంతా కలసి పనిచేద్దాం’’ అని ప్రధాని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజుల నుంచి దేశం పేరు మార్పు గురించి తీవ్ర స్థాయిలో చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. జీ20 సమ్మిట్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులు.. ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉండటంతో ఈ అంశం కాస్తా చర్చీనీయాంశమైంది. తాజాగా జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోడీ కూర్చున్న కుర్చీ వద్ద టేబుల్‌పై ఉండే దేశం నేమ్‌ప్లేట్‌పై ఇండియాకు బదులు భారత్ అని రాసి ఉంది.
ఇప్పటి వరకు అంతర్జాతీయంగా భారత్‌ను ఇండియాగా గుర్తించే వారు. ఇప్పుడు తొలిసారి ఓ అంతర్జాతీయ సమావేశంలో ఇండియాను భారత్‌గా గుర్తిస్తూ.. రౌండ్టేబుల్పై దేశం నేమ్‌ప్లేట్‌ను ఏర్పాటు చేశారు. జీ20 ప్రతినిధులను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న చైర్ వద్ద ఉన్న నేమ్‌ప్లేట్‌లో భారత్ అని రాసి ఉంది. మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. భారత్ మిమ్మల్ని స్వాగతిస్తోందన్నారు.