జాబిల్లి ఉపరితలంపై నిద్రపోతున్న చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌ను నాలుగేళ్ల కిందట ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 ఆర్బిటర్ ఫోటోలు తీసింది. ఈ ఫోటోలను తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శనివారం విడుదల చేసింది. ఇస్రో అధికారిక ఎక్స్ (ట్విట్టర్) లో ఈ ఫోటోలను షేర్ చేసిన ఇస్రో.. సెప్టెంబరు 6న చంద్రయాన్-2 ఆర్బిటర్ వీటిని తీసినట్టు పేర్కొంది.
‘చంద్రయాన్-2 ఆర్బిటర్‌కు చెందిన డ్యూయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చూర్ రాడార్ చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌ను సెప్టెంబరు 6న తీసిన ఫోటోలు ఇవి’ అని తెలిపింది. సెప్టెంబర్ 2019లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై ల్యాండింగ్ సమయంలో విఫలమైన విషయం తెలిసిందే.
ల్యాండర్ విఫలమైనా ఆర్బిటర్ మాత్రం చంద్రుడి కక్ష్య చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్ సమయంలో విక్రమ్‌తో ఈ ఆర్బిటర్‌ను విజయవంతంగా ఇస్రో అనుసంధానించింది. ల్యాండర్ ఫోటోలు తీసిన పరికరం గురించి ఇస్రో మరింత వివరిస్తూ “సర్ (ఎస్ ఎ ఆర్) పరికరం ఇచ్చిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో మైక్రోవేవ్‌లను ప్రసారం చేస్తుంది.. ఉపరితలం నుంచి ప్రతిబింబాన్ని అదే స్వీకరిస్తుంది. ఇది రాడార్ అయినందున సూర్యకాంతి అవసరం లేకుండా ఫోటోలు తీయగలదు. ఇది లక్ష్యానికి సంబంధించిన దూరం, భౌతిక లక్షణాలు రెండింటినీ అందించగలదు.. అందువల్ల, భూమి, ఇతర ఖగోళ వస్తువుల రిమోట్ సెన్సింగ్ కోసం సర్ ఉపయోగిస్తారు” అని తెలిపింది.
కాగా, చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్ ఆగస్ట్ 23న చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ల్యాండ్ అయ్యింది. ఈ నేపథ్యంలో మూన్ సౌత్ పోల్ వద్ద అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే చంద్రుడిపై లూనార్ నైట్ ప్రారంభం కావడంతో విక్రమ్ ల్యాండర్, దాని నుంచి చంద్రుడి ఉపరితలంపైకి దిగిన ప్రజ్ఞాన్ రోవర్‌ను స్లీప్ మోడ్‌లో ఇస్రో ఉంచింది.
మరోవైపు ఈ నెల 22న చంద్రుడిపై తిరిగి లూనార్ డే ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో చంద్రుడిపై సూర్యుడి కాంతి కిరణాలు పడే ఈ సమయం కోసం ఇస్రో ఎదురుచూస్తున్నది. అయితే లూనార్ నైట్ సమయంలో చంద్రుడి ఉపరితలంపై ఉండే మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వంటి పరిస్థితులను ల్యాండర్, రోవర్ తట్టుకుని తిరిగి అవి పనిచేస్తాయా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది.