మయన్మార్లో నెలకొన్న సంక్షోభంపై తక్షణమే దృష్టి సారించాలని ప్రపంచ దేశాలకు చెందిన 44 సంస్థలు జి20 దేశాధినేతలను కోరాయి. ఢిల్లీలో జి20 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఆయా సంఘాల ప్రతినిధులు ఓ బహిరంగ లేఖ రాశారు.
‘మయన్మార్లో సైనిక జుంటా వేధింపులు పెచ్చుమీరిపోయాయి. దీనిపై తక్షణమే, అందరూ కలసికట్టుగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక దేశాలుగా మీరు మీ పలుకుబడిని ఉపయోగించి సమస్యను పరిష్కరించాలి. అది మీ నైతిక బాధ్యత’ అంటూ స్పష్టం చేశారు.
`మయన్మార్లో నెలకొన్న పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత 30 నెలల్లో నాలుగు వేల మందికి పైగా చనిపోయారు. ఇరవై నాలుగు వేల మందిని అక్రమంగా నిర్బంధించారు. 145 మందికి మరణశిక్ష విధించారు. ఇవి ఎఎపిసి సంస్థ విడుదల చేసిన గణాంకాలు. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుంది’ అంటూ తెలిపారు.
`మయన్మార్ సైన్యం పౌరులను లక్ష్యంగా చేసుకొని 1,400కు పైగా వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మయన్మార్లో 17 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస అంచనా వేసింది. ఈ సంవత్సరాంతానికి ఆ సంఖ్య 27 లక్షలకు చేరవచ్చు’ అని ఆ సంస్థలు వివరించాయి.
మయన్మార్ సైనికులు 75 వేల ఇళ్లను తగలబెట్టారని, ఆ దేశంలో 1.7 కోట్ల మంది ప్రజలు మానవతా సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారని ఆ సంస్థలు తమ బహిరంగ లేఖలో తెలియజేశాయి.
‘మయన్మార్ సంక్షోభం ఇప్పుడు సరిహద్దులు దాటింది. దీనిని జి20 దేశాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఐదు కోట్ల మంది ప్రజల ఇబ్బందులను, ప్రాంతీయ భద్రతకు ఎదురవుతున్న ముప్పును కేవలం ఒక దేశం యొక్క ఆంతరంగిక వ్యవహారంగా చూడకూడదు’ అని స్పష్టం చేశారు.
మయన్మార్ సైన్యానికి సహాయం అందించే ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజానిదే అని తేల్చి చెప్పారు. ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఇంధనం, దౌత్యపరమైన బాసట వంటివి అందించడం ద్వారా సైనికుల వేధింపులకు, అకృత్యాలకు సాయపడే వారిని బాధ్యులుగా చేయాలని చెప్పారు. మయన్మార్ సైన్యంతో సంబంధాలు తెంపుకొని, నేషనల్ యూనిటీ ప్రభుత్వానికి చేయూత అందించాలని డిమాండ్ చేశారు.
మయన్మార్లో ఐదు కోట్ల మందికి పైగా ప్రజల జీవితాలు గాలిలో దీపంలా మారాయని పేర్కొంటూ సైనికుల అకృత్యాలపై చర్యలు చేపట్టకపోతే రోజురోజుకూ పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జి20 దేశాలు సకాలంలో నిర్దిష్టమైన, సమర్ధవంతమైన చర్యలు తీసుకొని సైనిక పాలకుల ఆగడాలకు కళ్లెం వేయాలి’ అని బహిరంగ లేఖలో ప్రపంచ దేశాలకు చెందిన 44 సంస్థలు కోరాయి.
బహిరంగ లేఖ రాసిన సంస్థల్లో మిల్క్ టీ అలయన్స్ ఫ్రండ్స్ ఆఫ్ మయన్మార్, ది యాక్షన్ కమిటీ ఫర్ డెమొక్రసీ డెవలప్మెంట్ (14 నెట్వర్క్ల కూటమి), ఆసియాన్ పార్లమెంటేరియన్స్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఇండియా ఫర్ మయన్మార్ ఉన్నాయి.