భారత అధ్యక్షతన ప్రతిష్టాత్మకంగా రెండు రోజులపాటు ఢిల్లీలో జరిగిన జీ 20 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. గ్రూపు తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సల్వాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించారు. ఈ మేరకు అధికారికంగా చిన్న సుత్తి వంటి గవెల్‌ను ఆయన చేతికి అందించారు.
అనంతరం సదస్సు తీర్మానాలను ప్రధాని మోదీ ప్రకటించారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ కు సంబంధించి విజన్‌పై చేస్తోన్న కృషికి జీ 20 ఓ వేదికగా మారడంతో నాకెంతో సంతృప్తి లభించింది. ’ అని సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. పలు కీలక అంశాలపైకూడా జీ20 బృందం చర్చించిందని తెలిపారు. దీంతోపాటు ఐరాసలో చేపట్టాల్సిన సంస్కరణల పైనా మోదీ మాట్లాడారు.
ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని భారత ప్రధాని ఉద్ఘాటించారు. సభ్య దేశాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ , ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య మారడం లేదని విచారం వ్యక్తం చేశారు. 51 దేశాలతో ఐక్యరాజ్యసమితి ఏర్పడిన సమయంలో పరిస్థితులు వేరన్న ఆయన ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 200 కు చేరువైన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా కాలానికి అనుగుణంగా ఎవరైతే మార్పు చెందరో , వారు ప్రాముఖ్యాన్ని కోల్పోతారని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇక సామాజిక భద్రత , ద్రవ్య, ఆర్థిక స్థిరత్వం వంటి వాటికి తోడు ఈసారి క్రిప్టో కరెన్సీ కొత్త అంశంగా తోడైందని ప్రధాని పేర్కొన్నారు. క్రిప్టోను నియంత్రించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు.
జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసిన నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక సూచన చేశారు. ప్రస్తుత సదస్సులో చేసిన సిఫార్సులు, తీర్మానాలను అంచనా వేయడానికి నవంబరు చివర్లో వర్చువల్ సమావేశం నిర్వహించాలని ఆయన సదస్సులో పాల్గొన్న దేశాధినేతలకు సూచించారు. నవంబరు 30 వరకు జీ20కి భారత నాయకత్వమే కొనసాగుతుందనే విషయాన్ని ప్రస్తావించారు.
బృంద అధ్యక్ష హోదాలో మరో రెండు నెలలు ఉండడం వల్ల మరిన్ని కార్యకలాపాలు పూర్తి చేయొచ్చని ఆయన అభిలషించారు. “గత రెండు రోజుల్లో మీరు మీ అభిప్రాయాలను వెల్లడించారు. సూచనలు, అనేక ప్రతిపాదనలు అందించారు. వాటిని నిశితంగా పరిశీలించడం, వేగవంతం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నాము” అని మోదీ వివరించారు.