అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదంతో రాష్ట్రాలన్నీ తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అటు దేశంలోని రైతులందరినీ మోసం చేసే ధోరణితో వెళ్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులందరికీ మేలు జరిగేలా ఎరువులపై సబ్సిడీ ఇస్తుంటే తెలంగాణలో ఆ సబ్సిడీ అందకుండా చేస్తున్న దుష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ విమర్శలు గుప్పించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎరువుల కొరత తీవ్రంగా కనపడుతోందని చెబతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎరువుల కోసం రైతులు క్యూ లో నిలబడి, చెప్పులు, పాస్ పుస్తకాలు పెట్టి గంటల కొద్దీ వేచిచూసి క్యూలైన్లలోనే సొమ్మసిల్లిపడిపోయారని, కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేశారు.
అయితే, నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘బీజ్ సే బజార్ తక్’ నినాదంతో ముందుకెళ్తోందని, రైతులకు విత్తనం నుంచి పంట అమ్ముకునేంతవరకు బాధ్యత తీసుకుంటోందని ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేశారు. విత్తనాలు, యాంత్రీకరణ, సబ్సిడీలు, భూసార పరీక్షలు, పంట నష్టపోతే ఇన్సూరెన్స్, పంటకు మద్దతు ధరతో పాటు వివిధ రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఆదుకుంటోందని తెలిపారు. కాని, కేసీఆర్ మాత్రం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు.
దేశవ్యాప్తంగా యూరియా సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వేపపూత యూరియాను నూటికి నూరు శాతం తప్పనిసరి చేయడంతో బ్లాక్ మార్కెట్ కు అడ్డుకట్ట పడిందని తెలిపారు. ఈ కారణంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేరాల్సిన ఎరువులను అడ్డుకుంటోందని బిజెపి నేత ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం రామగుండంలో రూ.6,300 కోట్లకుపైగా వెచ్చించి పునరుద్ధరించిన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) ఫ్యాక్టరీతో దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ఎరువుల కొరత లేకుండా చేసిందని చెప్పారు. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినా ధరల భారం రైతులపై పడకుండా సబ్సిడీ పెంచి అందుబాటు ధరలో, సకాలంలో ఎరువులను అందిస్తోందని తెలిపారు. పైగా, స్వదేశీ ఎరువుల ఉత్పాదకతను పెంచడంతో వ్యవసాయ ఉత్పాదకత పెరిగిన రైతులకు వ్యయభారం తగ్గించిందని వివరించారు.
కేంద్రం ప్రతి బస్తాపై సబ్సిడీ వివరాలను ముద్రించి ఎరువులను సరఫరా చేస్తుంటే రైతులకు ఈ విషయం తెలియద్దొనే దుష్టబుద్ధితో కేసీఆర్ ప్రభుత్వం ఆ ఎరువులను రైతులకు అందకుండా చేస్తోందని ఇంద్రసేనారెడ్డి ధ్వజమెత్తారు. మార్క్ ఫెడ్ లోనే ఎరువులు ఉంచుతూ రైతులకు అందకుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి ఎకరానికి రూ. 15 వేలకు పైగా సబ్సిడీ ఇస్తోందని ఆయన చెప్పారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో మూతబడిన 5 ఎరువుల కర్మాగారాలను పున:ప్రారంభించిందని పేర్కొంటూ గతంలో 50 లక్షల మంది రైతులకు 24 లక్షల టన్నుల ఎరువులు ఫ్రీగా ఇస్తామని నమ్మబలికి దగా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు.
మార్క్ ఫెడ్ లో ఉన్న ఎరువులను రైతులకు 24 గంటల్లోగా అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బిజెపి ఆధ్వర్యంలో మార్క్ ఫెడ్ ఆఫీసులను ఘెరావ్ చేసి రైతులకు ఎరువులు దక్కేలా చేస్తామంటూ రైతు వ్యతిరేక కేసీఆర్ ను హెచ్చరించారు.
కాగా,కాంగ్రెస్-బిజెపి రెండు ఒకేతాను ముక్కలని చెబుతూ కావాలని బిజెపి ని బద్నాం చేయాలనే కుట్ర చేస్తున్నాయని ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ పబ్లిక్ మీటింగ్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి కంటోన్మెంట్ బోర్డుకు ఏదైనా లేఖ రాశారా..? లేదా ఆన్ లైన్ లో అప్లికేషన్ ఇచ్చారా? రిపోర్టు బయటపెట్టాలని సవాల్ చేశారు. ఢిల్లీ హోంసెక్రటరీకి లేఖ రాశారా? ఫోన్ మెస్సేజ్ ఏమైనా పెట్టారా..? ఏవిధమైన నిరూపిత ఆధారాలున్నా చూపించమని నిలదీశారు.
కాంగ్రెస్ కు చిత్తశుధ్ధి ఉంటే పరేండ్ గ్రౌండ్స్ మీటింగుకు దరఖాస్తు చేసిన వివరాలు బయటపెట్టాలి గాని బిజెపి పై నిందలు మోపడం సబబు కాదని హెచ్చరించారు. ఇది మోసకారి పార్టీ కాంగ్రెస్ ఆడుతున్న పచ్చి నాటకం అంటూ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ బయటకు వచ్చిన తర్వాత కేసు విచారణ బుట్టదాఖలైంది.. అది లోపాయికారి ఒప్పందం కాదా? అంటూ నిలదీశారు.
ఎమ్మెల్సీ కవితతో మీకు వ్యాపార సంబంధాలున్నవి వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్-బిజెపి ఒకటేనంటూ దుష్ప్రచారం చేస్తున్నవారంతా గతంలో బీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్నవారే అంటూ ఏనాడు బీఆర్ఎస్ తో కలవని ఏకైక పార్టీ బిజెపి పార్టీయే అని స్పష్టం చేశారు.