భారత్‌కు అత్యంత వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని , మారుతున్న కాలానికి అనుగుణంగా ఇరు దేశాలు, కొత్త అంశాలతో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్‌లో భారత్ పర్యటనలో ఉన్న సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‌తో సోమవారం ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వాణిజ్యం, ఆర్థికం, రక్షణ రంగాలతో పాటు సాంస్కృతిక సహకారం వంటి ప్రధాన అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో వ్యూహాత్మక భాగస్వామ్య మండలి మొదటి సమావేశానికి ఇరువురు నేతలు అధ్యక్షత వహించారు. 2019లో రియాద్‌లో భారత్, సౌదీ అరేబియాల మధ్య జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేసిన సంగతి తెలిసిందే.
సౌదీ అరేబియా భారత్‌ను అత్యంత సన్నిహిత, వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటిగా భావిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఆ ప్రాంత, ప్రపంచ సంక్షేమం, స్థిరత్వం కోసం ఇరుదేశాల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. నేటి సమావేశం తమ బంధానికి కొత్త కోణాన్ని ఇచ్చిందని, ప్రజల కోసం పనిచేయడానికి స్ఫూర్తినిచ్చిందని చెప్పారు.
సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. జీ20 సదస్సును నిర్వహించినందుకు భారత్‌ను అభినందిస్తున్నానని, ఈ సదస్సు వల్ల యావత్ ప్రపంచం ఎంతో ప్రయోజనం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల గొప్ప భవిష్యత్తు కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు.
“భారత్‌లో ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. జి20 దేశాలకు మరియు ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చే అనేక ప్రకటనలు చేయబడ్డాయి. రెండు దేశాలకు గొప్ప భవిష్యత్తును సృష్టించేందుకు మేము కలిసి పని చేస్తాము” అని ఆయన ప్రకటించారు.
“హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, నేను చాలా ఉత్పాదకతపై చర్చలు జరిపాము. మేము మా వాణిజ్య సంబంధాలను సమీక్షించాము. రాబోయే కాలంలో మన దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత పెరుగుతాయని విశ్వసిస్తున్నాము. గ్రిడ్‌లో సహకారానికి అవకాశం కనెక్టివిటీ, పునరుత్పాదక శక్తి, ఆహార భద్రత, సెమీకండక్టర్లు మరియు సరఫరా గొలుసులు అపారమైనవి” అని ప్రధాని మోదీ ఎక్స్ ట్విట్టర్ లో రాశారు.