ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్ఇండియా ఆసియాకప్‌లో సాధికారిక విజయం సాధించింది. వర్షం కారణంగా రిజర్వ్‌డేలో కొనసాగిన పోరులో భారత్ 228 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. ఆదివారం 24.1 ఓవర్లలో 147/2తో మ్యాచ్ నిలిచిపోగా సోమవారం అక్కడి నుంచే తిరిగి ఆట ప్రారంభమైంది.
అయితే మరోసారి వరుణుడు అడ్డుపడటంతో మ్యాచ్‌కు ఆలస్యం కాగా ఆ తర్వాత కోహ్లీ (94 బంతుల్లో 122 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), రాహుల్ (106 బంతుల్లో 111; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగుల సునామీ సృష్టించారు. ప్రపంచంలోనే ప్రమాదకర పేస్ దళంగా గుర్తింపు సాధించిన పాక్ బౌలర్లను ఈ ఇద్దరూ చెడుగుడాడుకున్నారు.
తొలి రోజు ఓపెనర్లు రోహిత్ (56), గిల్ (58) అర్ధశతకాలు సాధిస్తే.. రెండో రోజు కోహ్లీ, రాహుల్ అజేయ శతకాలతో పాక్‌పై విరుచుకుపడ్డారు. పాక్ బౌలర్లలో షాహిన్, షాదాబ్ చెరో వికెట్ పడగొట్టారు. అనతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 32 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది.
ఫఖర్ జమాన్ (27), సల్మాన్ (23), ఇఫ్తిఖార్ (23) తలా కొన్ని పరుగులు చేయగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (10), ఇమామ్ (9), రిజ్వాన్ (2), షాదాబ్ (6), ఫహీమ్ అష్రఫ్ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 5 వికెట్లు పడగొట్టాడు. కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఆసియాకప్ సూపర్-4లో భారత్ పరిస్థితి విచిత్రంగా మారింది. లీగ్ దశ తర్వాత మన ప్లేయర్లకు సుదీర్ఘ విరామం లభించగా ఇప్పుడు వరుసగా మూడో రోజు బరిలోకి దిగాల్సి వస్తున్నది. షెడ్యూల్ ప్రకారం భారత్, పాకిస్థాన్ పోరు ఆదివారం జరగాల్సి ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో రిజర్వ్ డే కేటాయించడంతో సోమవారం కూడా ఆట కొనసాగింది.
ఆదివారం 24.1 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. సోమవారం మ్యాచ్‌ను ముగించింది. ఇక ఇప్పుడు మంగళవారం శ్రీలంకతో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. అంటే మన జట్టు వరుసగా మూడో రోజు కూడా మైదానంలో చెమటోడ్చనుంది.
47 వన్డే క్రికెట్లో విరాట్‌కు ఇది 47వ శతకం కాగా.. సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. 356/2 పాకిస్థాన్‌పై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. గతంలో విశాఖపట్నం వేదికగా 2005లో జరిగిన మ్యాచ్‌లోనూ దాయాదిపై భారత్ 9 వికెట్లకు సరిగ్గా ఇన్నే పరుగులు చేసింది.
356/2 విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జోడించిన 233 పరుగులే ఆసియా కప్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం. ఓవరాల్‌గా పాకిస్థాన్‌పై కూడా టీమ్ఇండియాకు ఇదే అత్యధికం. 1996లో సచిన్ టెండూల్కర్-నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధు (231) నెలకొల్పిన రికార్డు బద్దలైంది.
13000వన్డే క్రికెట్లో వేగంగా (267 ఇన్నింగ్స్‌ల్లో) 13 వేల పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. సచిన్ (321 ఇన్నింగ్స్‌ల్లో) రెండో స్థానంలో ఉన్నాడు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో విరాట్‌కు ఇది నాలుగో సెంచరీ కాగా, అందులో అతడు మూడు సార్లు నాటౌట్‌గా నిలువడం గమనార్హం.