బీజేపీలో చేరేందుకు సిద్దమైన క్యాసినో కింగ్ గా పేరొందిన చీకోటి ప్రవీణ్ కు మంగళవారం చుక్కెదురైంది. కర్మాన్ఘాట్లోని హనుమాన్ టెంపుల్ నుంచి భారీ ర్యాలీగా నాంపల్లి బీజేపీ ఆఫీసుకు పార్టీలో చేరేందుకు చేరుకున్నారు. కాసేపట్లో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి సమక్షంలో చీకోటి ప్రవీణ్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనగా, పార్టీ అధిష్టానం ఆదేశాలతో చీకోటి ప్రవీణ్ పార్టీలో చేరిక ఆగిపోయినదని చెబుతున్నారు.
గత వారం తెల్గీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో జైలులో ఉండివచ్చిన మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పార్టీలో చేరడం కూడా ఇదే విధంగా చివరిలో ఆగిపోయింది. లుగు రాష్ట్రాల్లో సంచలనమైన క్యాసినో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చీకోటి ప్రవీణ్ ను పార్టీలో చేర్చుకోవడంపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డిలో ఓ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని చీకోటి అన్నారు. బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాశ్ జవదేకర్… చీకోటి ప్రవీణ్ చేరిక అంశం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అప్పటి వరకు పార్టీ రాష్త్ర కార్యాలయంలో ఉన్న ఆయనతో పాటు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ వంటి వారు వెళ్లిపోవడంతో, ప్రవీణ్ వచ్చేసరికి నాయకులు ఎవ్వరు అందుబాటులో లేకపోవడంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చిందని చెబుతున్నారు.